నగర శివారు ప్రాంతాల్లో ఇళ్ళు కట్టుకుంటున్నారా..?
- మీకోసం జీ.హెచ్.ఎం.సి. శుభవార్త చెప్పింది..
- ఈ కీలక నిర్ణయం తగినంత ఫలితం ఇస్తుందా..?
- బిల్డ్ నౌ సాఫ్ట్ వేర్ లో కీలక మార్పులకు శ్రీకారం.. ..
- ప్రస్తుతం శివారు ప్రాంతాల్లో జీ ప్లస్ 2 వరకు అనుమతులు..
- మరిన్ని అంతస్తులకు కూడా అనుమతులు ఇచ్చే ఆలోచన..
- మూడు రోజుల క్రితమే మొదలైన దరఖాస్తుల ప్రక్రియ..
- ఇది తీపి కబురే అంటున్న కొందరు.. కాదంటున్న మరికొందరు..
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో నిలిచిపోయిన నిర్మాణ అనుమతులు..
- జీ.హెచ్.ఎం.సి.లో విలీనం అవడంతో పునరుద్ధరణ పనులకు శ్రీకారం..
- ప్రజలకు కలిగిన అసౌకర్యాన్ని తొలగించే ప్రక్రియ చేపట్టామన్న అధికారులు..
- బిల్డ్ నౌ సాఫ్ట్ వేర్ మార్పులపై " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " అందిస్తున్న ప్రత్యేక కథనం..

( స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ )
సొంతింటి నిర్మాణం సామాన్యులకు ఒక కల.. ఆ కలను నెరవేర్చుకునేందుకు ఎన్నెన్నో తంటాలు పడుతుంటారు.. రూపాయి, రూపాయి కూడగట్టుకుని ఎలాగైనా ఒక గూడు ఏర్పాటు చేసుకోవాలనుకుంటారు.. గృహ నిర్మాణానికి స్థలం కొనుగోలు ఒక ఎత్తు అయితే.. నిర్మాణం మరొక ఎత్తు.. లేబర్ చార్జీలు ఒకవైపు, మెటీరియల్ చార్జెస్ మరొకవైపు.. ఇది కాకుండా ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాల్సిన అనుమతులు.. ఇవన్నీ ఒక సామాన్యుడికి తాను మించిన భారం అవుతోంది.. వీటిని అరికట్టడానికి ప్రభుత్వాలు రకరకాల నిర్ణయాలు, రకరకాల పద్ధతులు అమల్లోకి తీసుకుని వస్తుంటారు.. అదే కోవలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బిల్డ్ నౌ అనే యాప్ ని తీసుకుని వచ్చింది.. కానీ నిర్వహణలో ఎన్నెన్నో లోపాలు కనిపించడంతో నిర్మాణదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. అయితే ఇప్పుడు జీ.హెచ్.ఎం.సి. విస్తృతం అయ్యే ప్రక్రియలో గృహ నిర్మాణాలకు సంబంధించి బిల్డ్ నౌ లో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.. ఈ క్రమంలో నగర శివారు ప్రాంతాల్లో గృహనిర్మాణాలు చేపట్టేవారికి కొంతమేర కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ శివారు ప్రాంతాల్లో నిర్మాణ అనుమతుల ప్రక్రియను పునరుద్ధరించింది. 'బిల్డ్‌నౌ' సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి.. దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది.. ప్రస్తుతం జీ ప్లస్ 2 వరకు అనుమతులు ఇవ్వనుండగా.. మరిన్ని అంతస్తుల నిర్మాణ అనుమతులకు సాఫ్ట్‌వేర్ మార్పులు జరుగుతున్నాయని తెలుస్తోంది..
ప్రస్తుతానికి జీ ప్లస్ 2 అంటే గ్రౌండ్ ప్లస్ రెండు అంతస్తులు.. వరకు ఉన్న భవనాలకు మాత్రమే అనుమతులు ఇవ్వనున్నారు. ఇన్‌స్టంట్ రిజిస్ట్రేషన్‌లో 75 చదరపు గజాల్లోపు భూములకు స్టిల్ట్ ప్లస్ 2 లేదా జి ప్లస్ 1 అనుమతి మంజూరు చేస్తారు. ఇన్‌స్టంట్ అప్రూవల్ కింద 75 నుంచి 1000 చదరపు గజాల్లోపు స్థలాల్లో స్టిల్ట్ ప్లస్ 5 నిర్మాణానికి అనుమతి ఇవ్వనున్నారు. అంతకుమించి ఎక్కువ అంతస్తుల నిర్మాణాలకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ మార్పులు ఇంకా జరుగుతున్నాయి కాబట్టి, వాటి అనుమతులు మంజూరు కావడానికి మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుంది.
ఇక రుసుము చెల్లింపుతో ముడిపడిన అన్ని రకాల పౌర సేవలు ప్రస్తుతం నిలిచిపోయాయి. వాటన్నింటినీ నిన్నటి నుండి అంతే సోమవారం నుండి పునరుద్ధరించి, ప్రజలకు అసౌకర్యాన్ని తొలగించామని పరిపాలన విభాగం ప్రకటించింది. విలీనమైన మున్సిపాలిటీల పరిధిలో గతంలో ఆయా మున్సిపల్ కమిషనర్ ఖాతాలకు చేరే భవన నిర్మాణ రుసుములు, జనన/మరణ ధ్రువపత్రాల రుసుములు, ఆస్తిపన్ను, ఎస్టేట్స్, ఇతర రుసుములన్నీ ఇకపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఖాతాకు చేరేలా చర్యలు చేపట్టారు.
హెచ్ఎండీఏ పరిధిలో ప్రస్తుతం వందలాది ఆకాశహర్మ్యాల భవనాల అనుమతి దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ నిబంధనలకు మధ్య చాలా వ్యత్యాసం ఉన్నందున గ్రేటర్ విలీనం నేపథ్యంలో ఈ దరఖాస్తులను ఏ నిబంధనల ప్రకారం ఆమోదించాలనే అంశంపై అధికారులు ప్రస్తుతం తర్జనభర్జన పడుతున్నారు. ఈ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది..
