హైదరాబాద్‌కు 'మెట్రో' కళ.. 2050 నాటికి 556 కిలోమీటర్లు!
- రూ. 4 లక్షల కోట్లతో రవాణా ‘మహా’ ప్లాన్.. ముసిరిన వంతెనలు, స్కైవాక్‌లు
- జయేష్ రంజన్ ఆధ్వర్యంలో CMP వర్క్‌షాప్.. ఫ్యూచర్ సిటీకి సరికొత్త బాటలు
హైదరాబాద్:
భాగ్యనగరం రూపురేఖలు మారబోతున్నాయి. ట్రాఫిక్ కష్టాల నుంచి గ్రేటర్ జనానికి విముక్తి కలిగించేలా ప్రభుత్వం భారీ స్కెచ్ వేసింది. 2050 నాటికి హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో *సమగ్ర రవాణా ప్రణాళిక (CMP)*ను సిద్ధం చేసింది. గురువారం జరిగిన కీలక సమావేశంలో రాబోయే పాతికేళ్ల అవసరాలకు అనుగుణంగా రూ. 4 లక్షల కోట్ల అంచనాతో రూపొందించిన ప్రతిపాదనలను వెల్లడించింది.
మెట్రో.. మూడు దశలు.. 556 కిలోమీటర్లు!
ఫేజ్-1 (2030 నాటికి): ప్రస్తుతం ఉన్న నెట్‌వర్క్‌ను మరో 258 కిమీలకు పెంచుతారు.
ఫేజ్-2 (2040 నాటికి): మెట్రో జాలాన్ని 534 కిలోమీటర్లకు విస్తరిస్తారు.
ఫైనల్ టచ్ (2050 నాటికి): మొత్తం 556.6 కిలోమీటర్ల మేర మెట్రో కూత వినిపించనుంది.
MMTS: లోకల్ రైళ్ల నెట్‌వర్క్‌ను కూడా 336.4 కిలోమీటర్లకు పెంచాలని నిర్ణయించారు.
మూసీపై 29 వంతెనలు.. 120 స్కైవాక్‌లు:
నదీ తీరంలో కొత్త శోభ: మూసీ నదిపై కొత్తగా 29 బ్రిడ్జిలు నిర్మించి ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టనున్నారు.
జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్లు: 75 గ్రేడ్ సెపరేటర్లు, 8 ఎలివేటెడ్ కారిడార్లతో ప్రయాణం సాఫీగా సాగనుంది.
పాదచారులకు పండగే: ఏకంగా 120 స్కైవాక్‌లు (FOBs) ఏర్పాటు చేసి రోడ్డు దాటే ఇబ్బందులు లేకుండా చేస్తారు.
రోడ్ల విస్తరణ: 2,847 కిలోమీటర్ల మేర కొత్త రహదారులు, దాదాపు 19 వేల లేన్ కిలోమీటర్ల సామర్థ్యాన్ని పెంచుతారు.
‘ట్రాన్సిట్ ఫస్ట్’.. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టే ముఖ్యం:
సొంత బండ్లు పక్కన పెట్టి.. జనం పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వైపు రావాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం 48 కిలోమీటర్ల పొడవునా ప్రత్యేక బస్సు లేన్లను నిర్మించనున్నారు. మెట్రో స్టేషన్ దిగగానే ఇంటికి వెళ్లేందుకు 'లాస్ట్ మైల్ కనెక్టివిటీ'ని పక్కాగా అమలు చేస్తారు.
హైస్పీడ్ కారిడార్లు: రీజినల్ రింగ్ రోడ్ (RRR) వరకు నగరాన్ని విస్తరించడమే కాకుండా, అమరావతి మరియు బెంగళూరు నగరాలను హైస్పీడ్ రైలు కారిడార్లతో అనుసంధానించాలని అధికారులు యోచిస్తున్నారు.
నిధుల వేట.. ₹4 లక్షల కోట్లు!
ఈ భారీ ప్రాజెక్టులన్నీ కార్యరూపం దాల్చాలంటే అక్షరాలా రూ. 4 లక్షల కోట్ల పెట్టుబడి అవసరమని LEA అసోసియేట్స్ అంచనా వేసింది. హైదరాబాద్‌ను గ్లోబల్ డెస్టినేషన్‌గా మార్చేందుకు ఈ ప్లాన్ ఒక మైలురాయి అని సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ ధీమా వ్యక్తం చేశారు.
