99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
వికారాబాద్:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా, జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అరైవ్ అలైవ్ (Arrive Alive) మరియు మాదకద్రవ్యాల నిర్మూలన కోసం “యాంటీ డ్రగ్ అవేర్‌నెస్” కార్యక్రమాన్ని వికారాబాద్‌లోని శ్రీ సాయి డెంటల్ కళాశాల ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు డీజీపీ ఆర్గనైజేషన్ & హోమ్ గార్డ్స్ మరియు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ స్వాతి లక్రా, ఐపీఎస్, ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అతిథులుగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, ఐఏఎస్ మరియు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ పాల్గొన్నారు.
ఇట్టి కార్యక్రమం డిఎం & హెచ్‌ఓ శాఖ ఆద్వర్యం లో అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడే సి.పి.ఆర్ (CPR) విధానంపై వైద్య బృందంతో ప్రత్యక్షంగా ప్రదర్శన చేయించారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులు నాటక రూపంలో ప్రదర్శించి ఆకట్టుకోగా, రోడ్డు ప్రమాదాలపై కళాజాత బృందం తమ ప్రదర్శనల ద్వారా ఆలోచింపజేశారు. రోడ్డు ప్రమాదాలకు దారితీసే అజాగ్రత్తల వల్ల కలిగే నష్టాలను వివరించే వీడియో చిత్రాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి స్వాతి లక్రా మాట్లాడుతూ, చిన్నపాటి నిర్లక్ష్యం వల్లనే పెద్ద ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ట్రాఫిక్ నిబంధనలు మరియు సిగ్నల్స్ పాటించాలని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించి స్ట్రాప్ పెట్టుకోవాలని సూచించారు. "స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్" అని పేర్కొంటూ.. అతివేగం, రాంగ్ రూట్ ప్రయాణం మరియు డ్రింక్ అండ్ డ్రైవ్ వంటివి ఒక నిండు కుటుంబాన్ని రోడ్డున పడేస్తాయని హెచ్చరించారు. “సే నో టు డ్రగ్స్ – యెస్ టు లైఫ్” అనే నినాదాన్ని ఇస్తూ, మాదకద్రవ్యాల జోలికి వెళితే జీవితం నాశనమవుతుందని, ఎవరైనా డ్రగ్స్ ఆఫర్ చేస్తే నిర్మొహమాటంగా ‘కాదు’ అని చెప్పాలని పిలుపునిచ్చారు. అలాగే యువత సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా రోడ్డు భద్రత మరియు డ్రగ్స్ నివారణపై విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రమాదాల నివారణకు ప్రతి గ్రామంలో ‘రోడ్ సేఫ్టీ కమిటీలను’ ఏర్పాటు చేశామని, అన్ని శాఖల అధికారులతో కలిసి జిల్లాలోని ‘బ్లాక్ స్పాట్స్’ (ప్రమాద హెచ్చరిక ప్రాంతాలు) గుర్తించి తగిన నివారణ చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డి.ఎం.హెచ్.ఓ (DM&HO) , జిల్లా అదనపు ఎస్.పి. బి. రాములు నాయక్ , డి.టి.సి. డి.ఎస్.పి. శ్రీనివాసులు, డి.సి.ఆర్.బి. డి.ఎస్.పి. జనయ్య , తాండూరు డి.టి.సి. యాదయ్య , జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, లారీ యూనియన్ సభ్యులు, ఆటో యూనియన్ సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు..jpeg)

