'గ్యాస్' అక్రమంగా విక్రయిస్తే భారీ జరిమానా, కేసు నమోదు

  • రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ కే.చంద్రారెడ్డి హెచ్చరిక 
  • సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయంలో జిల్లాస్థాయి అధికారుల సమావేశం

'గ్యాస్' అక్రమంగా విక్రయిస్తే భారీ జరిమానా, కేసు నమోదు

ఎల్బీనగర్:

రంగారెడ్డి జిల్లాలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాపై ప్రజలు ఆందోళన చెందవద్దని, గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్లను అక్రమంగా విక్రయిస్తే భారీ జరిమానాతోపాటు  క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ కే. చంద్రారెడ్డి హెచ్చరించారు. సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయంలో శనివారం జిల్లా స్థాయి అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ... అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం భారతదేశంలో పెట్రో ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ముఖ్యంగా గ్యాస్, ఇతర పెట్రో ఉత్పత్తుల రవాణా తగ్గినా... దేశంలో అవసరాలకు తగినంత గ్యాస్ నిల్వలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఆటంకం లేకుండా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ఉన్నతాధికారులతో ప్రత్యేక మానిటరింగ్ కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ఇంధన సరఫరా మానిటరింగ్ కమిటీ ఉందని, జిల్లాలో ఎక్కడా గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, ప్రజలకు సరిపడినంత గ్యాస్ సిలిండర్ల సరఫరా చేయడానికి మానిటరింగ్ కమిటీ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. జిల్లాస్థాయి కమిటీలో అదనపు కలెక్టర్ చైర్మన్ గా, డీఎస్వో కన్వీనర్ గా, ఎస్సీ లేదా సీపీ (పోలీస్ కమిషనర్), రెవెన్యూ అదనపు కలెక్టర్, రీజినల్ మేనేజర్, డీటీవో, డీఎం హెచ్ వో, డీఏవో, డీపీ ఆర్వో, సంక్షేమ శాఖల అధికారులు, గ్యాస్ ఏజెన్సీలు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. ఇంధన లోటు లేకుండా కంట్రోల్ రూమ్ సైతం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కమిటీ ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు సరిపడా గ్యాస్ అందజేయడానికి చర్యలు తీసుకుంటుందని వివరించారు.  కమిటీ సభ్యులు జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీలను సందర్శించడం, బ్లాక్ మార్కెట్ లో గ్యాస్ సిలిండర్ల విక్రయాలు అడ్డుకోవడం, గ్యాస్ నిల్వలపై తనిఖీలు, పోలీసుల సహకారం, విజిలెన్స్ తనిఖీలు, ప్రజలను అప్రమత్తం చేయడం తదితర విధులు నిర్వహిస్తారని అదనపు కలెక్టర్ వివరించారు. గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్లను అక్రమంగా విక్రయిస్తే జీవో 5 ప్రకారం, బీఎన్ ఎస్ 6ఏ, 7, 1955 చట్టం ప్రకారం భారీ జరిమానా, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ దవాఖానలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్, గృహ వినియోగదారులకు ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిలిండర్లు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. గ్యాస్ ఏజెన్సీలు తమ నిర్వాహణను పక్కాగా నిర్వహించాలని, డెలివరీ బాయ్స్ పై నిఘా పెట్టాలని, గ్యాస్ బుకింగ్ లో సమస్యలు లేకుండా చూసుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి సూచించారు. సమావేశంలో కందుకూరు ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, డీ ఎస్ వో వనజతరెడ్డి, ఏఎస్ వో పుల్లయ్య, డీఎం హెచ్ వో లలితాదేవి, రంగారెడ్డి డీటీసీ సదానందం, ఎమ్మార్వో వేణుగోపాల్, ఇన్ చార్జి డీపీ ఆర్వో బాలీశ్వరి, ఏసీఎస్ వో పుల్లయ్య, ఎల్పీజీ గ్యాస్ డీలర్స్, రెవిన్యూ, సివిల్ సప్లై సిబ్బంది పాల్గొన్నారు.

About The Author