రంగారెడ్డి జిల్లాలో అక్రమ డిప్యుటేషన్ల రద్దు
- డీఈఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు టీచర్లు మాతృ పాఠశాలలకు..
- బీసీ సంక్షేమ సంఘం ఫిర్యాదుతో విద్యాశాఖ ఉన్నతాధికారుల చర్యలు
రంగారెడ్డి జిల్లా:
రంగారెడ్డి జిల్లా విద్యాశాఖలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న అక్రమ డిప్యుటేషన్లపై ఉన్నతాధికారులు కొరడా ఝుళిపించారు. జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) కార్యాలయంలో అనధికారికంగా విధులు నిర్వహిస్తున్న ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లను తక్షణమే వారి సొంత పాఠశాలలకు పంపుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే..
కొత్తూరు మండలం మల్లాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో సోషల్ టీచర్‌గా పనిచేస్తున్న లక్ష్మీనరసింహులు, సరూర్ నగర్ మండలం బహదూర్‌గూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు టీచర్‌గా పనిచేస్తున్న బాదం వెంకటేష్‌లను ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండానే డీఈఓ పి.సుశీందర్ రావు తన కార్యాలయంలో డిప్యుటేషన్‌పై నియమించుకున్నారు. నిబంధనల ప్రకారం బోధన చేయాల్సిన ఉపాధ్యాయులను కార్యాలయ పనులకు వినియోగించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
ముఖ్యమంత్రికి ఫిర్యాదు:
ఈ అక్రమ డిప్యుటేషన్లపై తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిబంధనలను అతిక్రమించి ఉపాధ్యాయులను ఆఫీసు పనులకు కేటాయించడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డితో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఆయన లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.
నరేందర్ గౌడ్ ఫిర్యాదుపై స్పందించిన విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అక్రమ డిప్యుటేషన్లు నిజమేనని తేలడంతో, సదరు ఉపాధ్యాయులను వెంటనే వారి మాతృ పాఠశాలలకు రిలీవ్ చేయాలని ఆదేశించారు. దీంతో జిల్లా విద్యాశాఖాధికారి పి.సుశీందర్ రావు ఆ ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లను విధులనుంచి తొలగించి, తిరిగి వారి స్కూళ్లకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
