చట్టసభల్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలి: అల్లంపల్లి రామకోటి

  • *ఓట్ల యంత్రాలుగా, పల్లకీలు మోసే బోయీలుగానే బీసీలు
  • *పదవులు అనుభవిస్తూ సమాజాన్ని విస్మరిస్తున్న బీసీ ప్రజాప్రతినిధులు
  • *తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్.

చట్టసభల్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలి: అల్లంపల్లి రామకోటి

*హైదరాబాద్:

దేశంలో మెజారిటీ జనాభా కలిగిన బీసీల జీవితాలు స్వాతంత్ర్యం వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటినా నేటికీ దయనీయంగానే ఉన్నాయని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అల్లంపల్లి రామకోటి ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా, పల్లకీలు మోసే బోయీలుగా, రాజకీయ బానిసలుగానే వాడుకుంటున్నారని మండిపడ్డారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. బీసీల రాజ్యాధికారం, చట్టసభల్లో రిజర్వేషన్ల సాధనపై పలు డిమాండ్లను తెరపైకి తెచ్చారు.

*ప్రజాప్రతినిధుల స్వార్థం.. ప్రజల్లో అపనమ్మకం
బీసీల ఓట్లతో గెలిచి అసెంబ్లీలు, పార్లమెంటుకు వెళ్తున్న ఎంతోమంది బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తమ బాధ్యతను విస్మరిస్తున్నారని రామకోటి విమర్శించారు. పదవులు దక్కాక స్వార్థం, కుటుంబ ప్రయోజనాల కోసమే పనిచేస్తూ బడుగు, బలహీన వర్గాల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారని ధ్వజమెత్తారు.

"బీసీ నాయకుల వైఖరి వల్లే.. వారి కంటే ఓసీ పార్టీలే మెరుగైన పాలన అందిస్తాయేమో అనే భావన ప్రజల్లో బలంగా నాటుకుంటోంది. అయితే అన్ని ఓసీ పార్టీలు ఒకేలా ఉండవు. బీసీలకు నిజంగా పెద్దపీట వేసే పార్టీలను సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది."
         అల్లంపల్లి రామకోటి

పార్లమెంట్‌లో 'బీసీ బిల్లు' పెట్టాలి
దేశాన్ని బీసీ సామాజికవర్గానికి చెందిన నరేంద్ర మోదీ పాలిస్తున్న తరుణంలో.. బీసీల అభివృద్ధిని సాధించేందుకు ఇదొక గొప్ప అవకాశమని రామకోటి పేర్కొన్నారు. నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించి చరిత్రలో నిలిచిపోయారని గుర్తు చేశారు. అదేవిధంగా ప్రధాని మోదీ కూడా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటులో తక్షణమే ‘బీసీ బిల్లు’ను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.

*చరిత్ర ప్రశ్నిస్తుంది..
ఒక్క సంతకంతో బీసీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదంపొందేలా చేస్తే బీసీ సమాజం ఉన్నంతకాలం ప్రధానిని గుర్తుంచుకుంటుందని రామకోటి అన్నారు. రేపు పదవుల నుంచి తప్పుకున్నాక, బీసీల కోసం ఏం చేశారనే ప్రశ్న ఎదురుకాకుండా ఉండాలన్నా, బీసీలకు ఆత్మగౌరవాన్ని అందించిన నాయకునిగా నిలవాలన్నా ఈ బిల్లు చట్టం కావాలన్నారు. బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడాలని, వారు సగర్వంగా తలెత్తుకొని బతికేలా చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.

About The Author