
ఖమ్మం ప్రతినిది :
ఆశయం శాశ్వతం, లక్ష్యం తాత్కాలికం కాగా ఆచరణ కీలకం అని పల్లెప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండలరావు తెలిపారు. ఆదివారం బోనకల్ సిపిఎం కార్యాలయంలో జరిగిన స్టడీ సర్కిల్ లో ఆశయం -లక్ష్యం-ఆచరణ అనే అంశంపై క్లాస్ బోధించారు. స్టడీ సర్కిల్ కన్వీనర్ తెల్లాకుల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. మనుషులందరికీ ఆశయం శాశ్వతం, సమానం అని పల్లా కొండలరావు అన్నారు. ప్రకృతిని ప్రజలను కాపాడుకోవడమే ఈ ప్రపంచంలో అత్యుత్తమ ఆశయమన్నారు. ఆశయానికి ప్రయాణం మాత్రమే ఉంటుంది తప్ప గమ్యం ఉండదన్నారు. ఎప్పటికప్పుడు మెరుగైన సమాజం నిర్మించుకోవడం, అంతరాలు, అసమానతలు,పీడన, దోపిడి, ఆధిపత్యం తొలగించుకునేలా ప్రజల్లో చైతన్యం పెంచేలా స్టడీ సర్కిల్ సభ్యులు కృషి చేయాలని కోరారు. ప్రకృతిని ప్రజలను కాపాడేందుకు ఉపయోగపడే వివిధ అంశాలపై చర్చించడం, క్లాసులను బోధించే టీచర్లను తయారుచేయడం లక్ష్యంగా పెట్టుకుని పని విభజన చేసుకుని లక్ష్య సాధన దిశగా ఆచరణ ఉండేలా ప్లాన్ చేసుకోవాలన్నారు. పని విభజనలో భాగంగా ఈరోజు నేనేం చేయాలి అనేది వర్క్ ఎక్స్పీరియన్స్ డైరీ వ్రాయడం అలవాటు చేసుకోవాలన్నారు. ఆశ ఆకాశంలో పని పాతాళంలో ఉంటే ఏ లక్ష్యం సాధించలేమన్నారు. లక్ష్య సాధనలో ఆచరణే కీలకమన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతతో పని చేసి సమిష్టిగా శ్రమిస్తే లక్ష్యం సాధించడం తేలిక అవుతుందన్నారు. లక్ష్యం తాత్కాలికం, మధ్యంతరం , దీర్ఘకాలికం అనేవిగానూ వ్యక్తిగత, సమిష్టి లక్ష్యాలుగా ఉంటుంటాయనీ అయితే అంతిమంగా ఏ లక్ష్రమైనా ఆశయానికి లోబడి ఉండాలన్నారు. సిపిఎం మండల కార్యదర్శి కిలారు సురేష్, వ్యవసాయ కార్మిక సంఘం మధిర డివిజన్ అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు, ఐద్వా మధిర డివిజన్ అధ్యక్షురాలు జొన్నలగడ్డ సునీత, గండు సైదులు, మురళీ, ఉప్పర శ్రీను, బూర్గుల అప్పాచారి, చలమల హరికిషన్ రావు, గుగులోతు నరేష్, ఏసుపోగు బాబు, రామారావు , బిళ్ళా విశ్వనాధం తదితరులు పాల్గొన్నారు.