అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు..
- నలుగురి అరెస్టు.. రూ. 2.04 లక్షల నగదు స్వాధీనం.
- చెంగిచెర్లలో వరుస దొంగతనాలకు పాల్పడిన కిలాడీలు..
- మేడిపల్లి పోలీసులు, మల్కాజ్‌గిరి సి.సి.ఎస్ బృందం సంయుక్త ఆపరేషన్
మేడిపల్లి:
తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చేసుకొని అర్ధరాత్రి వేళ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను మేడిపల్లి పోలీసులు, మల్కాజ్‌గిరి సి.సి.ఎస్ (CCS) బృందం చాకచక్యంగా పట్టుకున్నారు. ముగ్గురు నిందితులతో పాటు దొంగిలించిన సొత్తును కొనుగోలు చేసిన రిసీవర్‌ను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 2.04 లక్షల నగదు, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
వరుస చోరీలతో కలకలం:
పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 15, 16 తేదీల మధ్య రాత్రి చెంగిచెర్లలోని కనకదుర్గ కాలనీలో ఈ ముఠా వీరంగం సృష్టించింది. ఒకే రాత్రి ఏకంగా 9 ఇళ్ల తాళాలు పగులగొట్టి నగదు, బంగారు ఆభరణాలతో పరారయ్యారు. ఈ ఘటనలపై మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనలకు గురికావడంతో రాచకొండ కమిషనరేట్ పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు.
ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఘటనా స్థలంలోని సిసిటివి దృశ్యాలను, సాంకేతిక ఆధారాలను విశ్లేషించారు. నిందితులు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన వారుగా గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
నేర చరిత్ర కలిగిన నిందితులు:
ఈ ముఠాలోని ఏ-1 నిందితుడు మహాదేవ్ ఝా గతంలో ఢిల్లీలో ఒక హత్య కేసులో మూడేళ్ల జైలు శిక్ష అనుభవించినట్లు పోలీసులు తెలిపారు. వీరిపై గతంలో ఢిల్లీలో ఆర్మ్స్ యాక్ట్, చోరీ కేసులు ఉండటమే కాకుండా.. వరంగల్, జనగామ, నల్గొండ జిల్లాల్లోనూ పలు దొంగతనాలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
