ఆరోగ్యమిత్రలను ట్రస్ట్ ఉద్యోగులుగా గుర్తించాలి

క్యాడర్ స్ట్రెంత్ జీవో విడుదలపై హర్షం.. రాష్ట్రస్థాయి సమావేశంలో నేతల డిమాండ్

ఆరోగ్యమిత్రలను ట్రస్ట్ ఉద్యోగులుగా గుర్తించాలి

హైదరాబాద్:

రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ పరిధిలో గత 18 ఏళ్లుగా సేవలందిస్తున్న ఆరోగ్యమిత్రల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని పలువురు కార్మిక నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యమిత్రలకు క్యాడర్ స్ట్రెంత్ కల్పిస్తూ జీవో విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూనే, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.

​ప్రభుత్వ గుర్తింపు అవసరం: జాన్ వెస్లీ

​సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ.. పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఆరోగ్యమిత్రల పాత్ర కీలకమన్నారు. దశాబ్ద కాలంగా పనిచేస్తున్న వీరిని ప్రభుత్వం తక్షణమే ట్రస్ట్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. యూనియన్ గౌరవ అధ్యక్షుడు భూపాల్ మాట్లాడుతూ, ఆరోగ్యమిత్రలు సుదీర్ఘ కాలంగా శ్రమ దోపిడీకి గురవుతున్నారని, ప్రభుత్వం ఇకనైనా ఆలస్యం చేయకుండా వారి సర్వీసును క్రమబద్ధీకరించాలన్నారు.

​మహిళా శక్తికి పిలుపు:

​అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి. జయలక్ష్మి మహిళా ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ఎదురించేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

​మంత్రికి కృతజ్ఞతలు:

​యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గిరి యాదయ్య మాట్లాడుతూ.. ఆరోగ్యమిత్రల సుదీర్ఘ పోరాట ఫలితంగానే నేడు క్యాడర్ స్ట్రెంత్ జీవో సాధ్యమైందన్నారు. ఇందుకు చొరవ చూపిన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ ఉదయ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం. కుమార్, ఉపాధ్యక్షులు సుమన్, రాష్ట్ర కమిటీ సభ్యులు కిషోర్, రవీందర్, వివిధ జిల్లాల అధ్యక్షులు రాజు (హైదరాబాద్), రత్నం (రంగారెడ్డి), నాగరాజు (నల్గొండ), యూసఫ్ (మేడ్చల్), బాలరాజ్ (వికారాబాద్)తో పాటు నగేష్, ఈశ్వరి బాయ్, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

About The Author