ఆస్తి పన్ను వడ్డీపై 90 శాతం రాయితీ: ఓటీఎస్ సద్వినియోగం చేసుకోండి.
మార్చి 31 వరకు గడువు.. 'మై క్యూర్' యాప్‌లోనూ చెల్లింపు సౌకర్యం జిహెచ్‌ఎంసి కమిషనర్ ఆర్.వి. కర్ణన్ వెల్లడి.
హైదరాబాద్:
నగరంలో ఆస్తి పన్ను బకాయిలు ఉన్న వారు ప్రభుత్వం కల్పించిన 'వన్ టైమ్ సెటిల్మెంట్' (ఓటీఎస్) పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్‌ఎంసి) కమిషనర్ ఆర్.వి. కర్ణన్ పిలుపునిచ్చారు. పాత బకాయిలపై పేరుకుపోయిన వడ్డీలో 90 శాతం రాయితీ ఇస్తున్నామని, ఈ అవకాశం మార్చి 31 వరకే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సోమవారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అదనపు కమిషనర్లు ప్రియాంక అల, రవికిరణ్, పీఆర్ఓ మామిండ్ల దశరథంతో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు.
పెరిగిన పన్ను వసూళ్లు:
కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం.. క్యూర్ (CURE) పరిధిలోని 28.08 లక్షల మంది ఆస్తి పన్ను దారుల్లో ఇప్పటివరకు 16.80 లక్షల మంది పన్ను చెల్లించారు. గతేడాది ఇదే సమయానికి రూ.1,984 కోట్ల ఆదాయం రాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.2,186 కోట్లు వసూలైందని ఆయన వివరించారు. పన్ను చెల్లింపుల్లో పారదర్శకత కోసం ఆన్‌లైన్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నామని.. మీ-సేవ కేంద్రాలు, వెబ్‌సైట్, సిటిజన్ సర్వీస్ సెంటర్లు లేదా 'మై క్యూర్' (My CURE) యాప్ ద్వారా చెల్లించవచ్చని సూచించారు. దీర్ఘకాలికంగా పన్ను ఎగవేసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన "ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక"లో భాగంగా గత పది రోజులుగా (మార్చి 6 నుండి 16 వరకు) నగరవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.
పారిశుద్ధ్యం: గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల (GVP) తొలగింపు, రహదారుల క్లీనింగ్, ప్రజారోగ్య కేంద్రాల నిర్వహణ.
పర్యావరణం: మెగా ఈ-వేస్ట్ డ్రైవ్ ద్వారా ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ, నిర్మాణ వ్యర్థాల (C&D Waste) తొలగింపు.
ముమ్మరంగా ఓటీఎస్ ప్రచారం:
ఓటీఎస్ పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని కర్ణన్ తెలిపారు. 100 బస్ షెల్టర్లలో పోస్టర్లు, కేబుల్ టీవీ, ఎఫ్.ఎం. రేడియో, సోషల్ మీడియా వేదికగా ప్రకటనలు ఇస్తున్నట్లు చెప్పారు. సినిమా థియేటర్లలో ప్రదర్శించేందుకు ప్రత్యేక వీడియోలను సిద్ధం చేశామని, వీటికి సెన్సార్ బోర్డు (CBFC) అనుమతి కూడా లభించిందని, మంగళవారం నుంచి ఇవి ప్రదర్శితమవుతాయని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌ను పరిశుభ్రమైన, సుపరిపాలన కలిగిన నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.
