తిమ్మాపూర్ గ్రామంలో ఘనంగా పోషణ పక్షం పై అవగాహన
- - అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి
- - తిమ్మాపూర్ సర్పంచ్ గుర్రాల శ్రీనివాస్
దుబ్బాక:
గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకొని పోషకాహారం తీసుకోవాలని తిమ్మాపూర్ సర్పంచ్ గుర్రాల శ్రీనివాస్ సూచించారు.9 ఏప్రిల్ నుండి 23 వరకు నిర్వహిస్తున్న పోషణ పక్షం కార్యక్రమాల షెడ్యూల్‌లో భాగంగా, దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలోని రెండవ అంగన్వాడీ కేంద్రంలో సెక్టార్ స్థాయి పోషణ పక్షం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.
ఈ సందర్భంగా పోషణ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ శ్యాంసన్ మాట్లాడుతూ, ప్రాజెక్ట్ పరిధిలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం, చిరుధాన్యాలు, ఆకుకూరలు వంటి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించారు. గర్భధారణ నుండి బిడ్డ రెండేళ్ల వయస్సు వరకు ఉన్న 1000 రోజుల ప్రాముఖ్యతను వివరించారు.అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందించే “ఆరోగ్య లక్ష్మి” పథకం కింద అదనపు సంపూర్ణ భోజనాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు.గ్రామ సర్పంచ్ గుర్రాల శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ అంగన్వాడీ సేవలు గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరమని, ఇలాంటి కార్యక్రమాలు గ్రామస్థాయిలో అవగాహన పెంచుతాయని తెలిపారు. అలాగే “బేటి బచావో బేటి పడావో” కార్యక్రమంలో భాగంగా గర్ల్ చైల్డ్ కిట్ల పంపిణీ ప్రారంభించినందుకు సంతోషం వ్యక్తం చేశారు.మహిళా సాధికారత కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ వాసవి మాట్లాడుతూ ఆడపిల్లల ప్రాముఖ్యతను వివరించి బాలింతలకు గర్ల్ చైల్డ్ బేబీ కిట్లను పంపిణీ చేశారు. మెడికల్ ఆఫీసర్ దివ్యశ్రీ గర్భిణీలు, బాలింతలు పాటించాల్సిన ఆరోగ్య సూచనలు, జాగ్రత్తలను వివరించారు.కార్యక్రమంలో గర్భిణీలకు శ్రీమంతాలు నిర్వహించగా, చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.కార్యక్రమం ముగింపులో గ్రామ సర్పంచ్ గుర్రాల శ్రీనివాస్, ఉప సర్పంచ్ విజయ్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌తో పాటు పాలకవర్గ సభ్యులందరినీ అంగన్వాడీ సిబ్బంది శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పోషణ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ శ్యాంసన్, జిల్లా మహిళా సాధికారిత కేంద్రం కోఆర్డినేటర్ వాసవి, మండల్ కోఆర్డినేటర్ పద్మ, ఐసీడీఎస్ సెక్టార్ సూపర్వైసర్ స్వరూప, మెడికల్ ఆఫీసర్ దివ్యశ్రీ, గ్రామ ప్రజాప్రతినిధులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
