*జీహెచ్ఎంసీలో 'బడంగ్ పేట్' అవినీతి అరాచకం..!

  • *కమిషనర్ కర్ణన్ సాబ్.. ఇటు చూడండి..!నాలా కన్వర్షన్, అనుమతులు లేకుండానే అక్రమ వెంచర్లు.. సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్ అధికారుల అండదండలతో కోట్లల్లో పన్నుల లూటీ!
  •  *బడంగ్ పేట్ సర్కిల్-16 లో బోలెడు అక్రమ వెంచర్లు: రియల్ మాఫియాతో చేతులు కలిపిన డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి దినేష్!
  •  *చంపాపేట్ సబ్ రిజిస్ట్రార్ రెహమాన్ ముడుపుల భాగోతం.. నాలా కన్వర్షన్ లేకుండానే అక్రమ రిజిస్ట్రేషన్ల పర్వం.
  •  *గ్రామ పంచాయతీ పాత సర్పంచుల సంతకాలతో ఫోర్జరీ ఎల్ఆర్ఎస్ (LRS) పత్రాలు, డూప్లికేట్ లేఅవుట్ లతో ప్రజలకు టోకరా.
  • *జోనల్ కమిషనర్ చంద్రకళ చర్యలు ఎక్కడ..? ఏసీబీ విజిలెన్స్ నిఘా విభాగాలు దృష్టి సారించాలి..!
  •  *గతంలో ఇద్దరు కమిషనర్లతో సహా ఎనిమిది మంది సస్పెండ్ అయినా.. ఏసీబీ దాడులు జరిగినా మారని అధికారుల తీరు.
  • ఉన్నతాధికారుల వాటా ఎంత?

*జీహెచ్ఎంసీలో 'బడంగ్ పేట్' అవినీతి అరాచకం..!

సామాన్యుడు వంద గజాల సొంతింటి కల కోసం అల్లాడిపోతుంటే, నిబంధనల తుంగలో తొక్కి నిలువునా దోచేస్తున్న అవినీతి రాబందుల అరాచకం జీహెచ్ఎంసీ బడంగ్ పేట్ పరిధిలో పరాకాష్టకు చేరింది. నాలా కన్వర్షన్ లేదు.. అనుమతుల ఊసే లేదు.. కానీ, చంపాపేట్ సబ్ రిజిస్ట్రార్ రెహమాన్ ముడుపుల మత్తులో రిజిస్ట్రేషన్ల జెట్ స్పీడ్ పెంచేశారు! ఇటు డీసీ సమ్మయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి దినేష్‌లు రియల్ మాఫియాకు 'ముడుపుల' రక్షణ వలయం పడుతూ కోట్ల ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తున్నారు. గతంలో ఏసీబీ దాడులు, సస్పెన్షన్లు జరిగినా ఈ తిమింగలాల తీరు మారలేదు. ఫోర్జరీ పత్రాలతో ప్రజలను ముంచుతున్న ఈ అక్రమ గేటెడ్ సామ్రాజ్యాలపై కమిషనర్ కర్ణన్ గారు తక్షణమే కొరడా ఝుళిపించాల్సిందే!


*హైదరాబాద్:
హైదరాబాద్‌ నగర శివార్లలోని బడంగ్ పేట్ సర్కిల్-16 అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ (HMDA) నియమ నిబంధనలను తుంగలో తొక్కుతూ, ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే ఎకరాల కొద్దీ అక్రమ వెంచర్లు, గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్లు మూడు పువ్వులు ఆరు కాయలుగా విల్సిల్లుతున్నాయి. ఈ దందా వెనుక బడంగ్ పేట్ మున్సిపల్ అధికారుల, సబ్ రిజిస్ట్రార్ల అండదండలు పుష్కలంగా ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

*నాలా కన్వర్షన్ లేదు.. అనుమతులు లేవు.. కానీ రిజిస్ట్రేషన్లు మాత్రం జెట్ స్పీడ్!
చంపాపేట్ సబ్ రిజిస్ట్రార్ రెహమాన్ భారీగా ముడుపులు తీసుకుంటూ నాలా కన్వర్షన్ (వ్యవసాయేతర భూమి మార్పిడి) లేకుండానే అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు పక్కా ఆధారాలు లభ్యమయ్యాయి. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ లేఅవుట్ అనుమతులు లేకపోయినా, నిబంధనలకు విరుద్ధంగా గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్లకు అక్రమ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు కానిచ్చేస్తున్నారు. గతంలో ఇక్కడ ఇదే విధంగా రైతు పాసుబుక్కులపై నిర్మాణ అనుమతులు ఇచ్చిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. దీనివల్ల రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కు రావలసిన కోట్ల రూపాయల పన్నుల ఆదాయానికి భారీ గండి పడుతోంది.WhatsApp Image 2026-06-08 at 18.57.43

*డీసీ సమ్మయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి దినేష్ ల 'ముడుపుల' రక్షణ వలయం!
ప్రభుత్వ ఖజానాకు చేరవలసిన కోట్ల రూపాయల లేఅవుట్ పన్నులను మున్సిపల్ అధికారులు తమ సొంత జేబుల్లో వేసుకుంటున్నారు. ప్రస్తుతం బడంగ్ పేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి దినేష్ ఈ అక్రమ వెంచర్లకు ప్రధాన సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు తీవ్రతరమయ్యాయి. ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చినప్పుడు, కంటితుడుపుగా సదరు అక్రమ వెంచర్లకు నోటీసులు ఇచ్చినట్లే ఇచ్చి, తెరవెనుక ముడుపులు అందుకోగానే అటువైపు చూడటం మానేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, ఈ అక్రమ వెంచర్లకే అడ్డగోలుగా నిర్మాణ అనుమతులు కూడా జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

*సర్వే నంబర్ల వారీగా అక్రమాల చిట్టా:
బడంగ్ పేట్ సర్కిల్ పరిధిలో బహిరంగంగానే పెద్ద ఎత్తున బోర్డులు పెట్టి, భూగర్భ డ్రైనేజీ పనులు చేస్తూ అక్రమ దందా సాగిస్తున్నారు.WhatsApp Image 2026-06-08 at 18.30.23

 ప్రధానంగా:
 *బాలాపూర్ గ్రామం: సర్వే నంబర్ 9, 10, 11 లలో సుమారు 2 ఎకరాల 20 గుంటల్లో ఎలాంటి అనుమతులు లేవు.

 *నాదర్ గుల్: సర్వే నంబర్లు 1-85, 1-86, 1-95, 97, 1-103, 1-105 లలో దాదాపు 5 ఎకరాలలో అక్రమ వెంచర్లు వెలిశాయి.
ఇక్కడ విస్తుపోయే విషయమేమిటంటే.. పాత గ్రామ పంచాయతీ సర్పంచుల సంతకాలను ఫోర్జరీ చేసి, నకిలీ ఎల్ఆర్ఎస్ పత్రాలు, డూప్లికేట్ లేఅవుట్ ఆఫీసులను సృష్టించి ప్లాట్లను వేలానికి ఉంచారు.

*సామాన్యుడికి ఒక న్యాయం.. రియల్ మాఫియాకు ఒక న్యాయమా?
పేద, మధ్యతరగతి ప్రజలు బ్యాంకుల నుండి అప్పులు తెచ్చుకుని 60 లేదా 100 గజాలలో ఇల్లు కట్టుకుంటే చాలు.. 'అనుమతులు ఉన్నాయా? సెట్‌బ్యాక్ ఎక్కడ? ఎన్ని అంతస్తులు?' అంటూ గద్దల్లా వాలిపోయి వేధింపులకు గురిచేసే డీసీ, టౌన్ ప్లానింగ్ అధికారులు.. ఎకరాలకు ఎకరాలు అక్రమంగా వెలుస్తున్న వెంచర్ల వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం వెనుక ఉన్న రహస్యమేమిటి? ఈ అవినీతి వాటాలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఉన్నతాధికారుల హస్తం ఎంత? ఉన్నతాధికారులకు వాటాలు లేకపోతే వారి మౌనానికి అర్థమేమిటి? అని స్థానికులు నిలదీస్తున్నారు.WhatsApp Image 2026-06-08 at 18.29.12

*కమిషనర్ గారూ.. తక్షణమే సమగ్ర విచారణ జరపండి!
గతంలో ఇదే బడంగ్ పేట్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలపై ఇద్దరు కమిషనర్లతో సహా ఎనిమిది మంది అధికారులు సస్పెండ్ అయ్యారు. ఏసీబీ (ACB) అధికారులు దాడులు చేసినా ఇక్కడి అధికారుల తీరు మారలేదు. ఫోర్జరీ పత్రాలతో వెలిసిన ఈ అక్రమ వెంచర్లలో తెలియక ప్లాట్లు కొని సామాన్య ప్రజలు మోసపోతే ఎవరు బాధ్యత వహిస్తారు?
అందుకే, కమిషనర్ కర్ణన్ గారు తక్షణమే స్పందించి, చంపాపేట్ సబ్ రిజిస్ట్రార్ రెహమాన్, బడంగ్ పేట్ డీసీ సమ్మయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి దినేష్‌ల అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని, రియల్ ఎస్టేట్ మాఫియాకు అండగా నిలుస్తున్న అధికారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే అక్రమ వెంచర్లను వెంటనే నిలిపివేయాలని 'భారత శక్తి' డిమాండ్ చేస్తోంది.WhatsApp Image 2026-06-08 at 18.40.42WhatsApp Image 2026-06-08 at 18.29.11 (1)WhatsApp Image 2026-06-08 at 18.30.21

About The Author