శ్రీరామనవమి శోభాయాత్రకు భాగ్యనగరం రెడీ!
- 3 వేల మందితో భారీ బందోబస్తు.. డ్రోన్ల తో నిఘా..
- డీజేలు వద్దు.. నార్మల్ సౌండ్ సిస్టమ్ వాడాలి.
- మధ్యాహ్నం 1 గంటకే యాత్ర ప్రారంభించాలి: సీపీ సజ్జనర్
- జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్ తో కలిసి రూట్ మ్యాప్ పరిశీలన
హైదరాబాద్:
నగరంలో శ్రీరామనవమి శోభాయాత్రను వైభవంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు సర్కారు యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది. సోమవారం సీతారాంబాగ్ లోని ద్రౌపది గార్డెన్స్‌లో పోలీస్ కమిషనర్ సజ్జనర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. యాత్ర ఏర్పాట్లు, భద్రతపై అధికారులకు సీపీ దిశానిర్దేశం చేశారు.
అడుగడుగునా నిఘా.. షీ టీమ్స్ పహారా
సీతారాంబాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు సాగే ఈ యాత్రకు దాదాపు 3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ ప్రకటించారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిరంతరం నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా చైన్ స్నాచింగ్ లు జరగకుండా క్రైమ్ టీమ్స్, మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ రంగంలో ఉంటాయన్నారు. గతేడాది వాహనాల బ్రేక్‌డౌన్ వల్ల యాత్ర ఆలస్యమైందని, ఈసారి అలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
శోభాయాత్ర నిర్వహణపై సీపీ కీలక సూచనలు చేశారు.
యాత్రను మధ్యాహ్నం 1 గంటకే మొదలుపెట్టాలి.
పెద్ద వాహనాలతో ఇబ్బంది కలగకుండా ముందస్తుగా ట్రయల్ రన్ చేయాలి.
హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా డీజేలకు బదులు సాధారణ సౌండ్ సిస్టమ్ వాడాలి.
ఇతర వర్గాల మనోభావాలు దెబ్బతినేలా పాటలు, స్పీచ్ లు ఉండకూడదు.
ప్రైవేట్ వ్యక్తులు డ్రోన్లు వాడాలంటే పోలీసుల పర్మిషన్ తప్పనిసరి.
రోడ్ల మరమ్మతులు పూర్తి: జీహెచ్‌ఎంసీ కమిషనర్
భక్తులకు ఇబ్బంది కలగకుండా రోడ్ల రిపేర్లు, వీధి దీపాల ఏర్పాటు పూర్తి చేశామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. యాత్రలో పాల్గొనే వాహనాల ఎత్తు విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనంతరం అధికారులు శోభాయాత్ర సాగే రూట్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ మీటింగ్‌లో అడిషనల్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీలు జోయల్ డేవిస్, శ్వేత, జోనల్ కమిషనర్ ముకుంద రెడ్డి, ఉత్సవ సమితి సభ్యులు భగవంతరావు, గోవింద్ రాఠి, ఆనంద్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
