'బిల్డ్ నౌ'మాటున.. సరూర్నగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతి,
- ఎల్బీనగర్ సర్కిల్ 12లో టౌన్ ప్లానింగ్ అధికారుల 'ముడుపుల' దందా
- రెండు ప్లాట్లు.. రెండు పర్మిషన్లు.. కానీ కట్టేది మాత్రం 'ఒక్కటే' భారీ కమర్షియల్ కాంప్లెక్స్!
- ఫిర్యాదులపై వార్త కథనాలపై నెలలు గడుస్తున్నా నోరు మెదపని డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, ACP మధు, ఆర్చన
- ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ పాటిల్ చర్యలు ఎక్కడ..! మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి దృష్టి సారించాలి..!
- 'హైడ్రా' కమిషనర్ రంగంలోకి దిగితేనే అక్రమార్కుల గుట్టు రట్టు!
హైదరాబాద్:
ప్రభుత్వం ప్రజల సౌలభ్యం కోసం తెచ్చిన 'బిల్డ్ నో' (BuildNo) విధానం అధికారుల పాలిట కామధేనువుగా మారింది. సెల్ఫ్ సర్టిఫికేషన్ పేరుతో జరుగుతున్న ఈ దోపిడీకి ఎల్బీనగర్ సర్కిల్-12 అడ్డాగా మారింది. హుడా కాలనీలో నిబంధనలను తుంగలో తొక్కి నిర్మిస్తున్న ఓ భారీ కట్టడం అధికారుల అవినీతికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఇక్కడ నిబంధనలు పనిచేయవు.. కేవలం 'నోట్ల కట్టలు' ఉంటే చాలు అన్నట్లుగా టౌన్ ప్లానింగ్ విభాగం వ్యవహరిస్తోంది.
ఒక్కటే ప్లాట్.. రెండు పర్మిషన్లు.. ఇదెక్కడి 'క్లబ్బింగ్' దందా?
హుడా కాలనీలోని ప్లాట్ నంబర్ 39లో బిల్డర్లు ఆడుతున్న అక్రమకాండ అంతా ఇంతా కాదు. నివాస గృహాల పేరుతో అనుమతులు పొంది, క్షేత్రస్థాయిలో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా వాటిని విలీనం (Clubbing) చేసి భారీ వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తున్నారు.
అక్రమాలకు వేదికైన ఫైల్ నంబర్లు ఇవే:
010392/GHMC/03322/IABP/C5/2025
010390/GHMC/03321/IABP/C5/2025
ఈ రెండు ఫైళ్ల ద్వారా వేర్వేరుగా పర్మిషన్లు తీసుకున్నట్లు రికార్డుల్లో చూపించి, వాస్తవానికి ఒకే భారీ భవనాన్ని లేపుతున్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా, టౌన్ ప్లానింగ్ చట్టాలను అపహాస్యం చేయడమే.
డిప్యూటీ కమిషనర్ గారికి 'కనిపించదా'? ఏసీపీలకు 'వినపడదా'?
ఈ అక్రమ నిర్మాణంపై గత కొన్ని నెలలుగా ఫిర్యాదులు అందుతున్నా, వార్తా కథనాలు వస్తున్నా అధికారులు మాత్రం 'మిన్నకుండి' పోతున్నారు. సర్కిల్-12 డిప్యూటీ కమిషనర్ భువనగిరి శ్రీనివాస్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ మధు, అధికారిణి ఆర్చనల మౌనం వెనుక భారీ స్థాయిలో ముడుపులు అందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదు అందిన తక్షణమే నోటీసులు జారీ చేసి పనులు నిలిపివేయాల్సి ఉండగా, అధికారులే బిల్డర్లకు 'రక్షణ కవచం'లా మారడం గమనార్హం. అధికారులు కేవలం సీట్లు అలంకరించడానికేనా? లేక అక్రమార్కులకు కొమ్ముకాయడానికా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
నివాస భవనంగా అనుమతి పొంది, లోపల కమర్షియల్ హంగులు అద్దడమే కాకుండా.. రహస్యంగా లోతైన సెల్లార్లు తవ్వేస్తున్నారు. కనీస సెట్ బ్యాక్ లు లేవు, అగ్నిమాపక వాహనం వెళ్లే దారి లేదు. రేపు పొరపాటున అగ్ని ప్రమాదం జరిగితే జరిగే ప్రాణనష్టానికి ఈ అధికారులే బాధ్యత వహిస్తారా? నోటీసులు ఇస్తున్నామంటూ నెలల తరబడి కాలయాపన చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో అందరికీ అర్థమవుతూనే ఉంది.
హైడ్రా రాకతోనైనా 'న్యాయం' జరుగుతుందా?
