వ్యాపారమే పరమావధి.. ప్రాణాలకు లేదు రక్షాకవచం!

  • షోరూం యజమాని అరెస్ట్
  • ​మృత్యు కుహరాలుగా మారుతున్న వాణిజ్య సముదాయాలు..
  • అధికారుల అవినీతే శాపమా?

వ్యాపారమే పరమావధి.. ప్రాణాలకు లేదు రక్షాకవచం!

ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు. తన మేడలో ఉన్న ఐశ్వర్యాన్ని కాపాడుకోవడానికి ఇంటి చుట్టూ దట్టమైన ఇనుప కంచె వేసుకున్నాడు. ఒకరోజు ఇంట్లో మంటలు చెలరేగాయి. ఆ ఇనుప కంచె దొంగలను రాకుండా ఆపింది కానీ, లోపల ఉన్న యజమానిని బయటకు రానివ్వలేదు. చివరకు తన స్వార్థమే తన ప్రాణానికి ముప్పుగా మారింది. ​నేడు భాగ్యనగరంలోని వాణిజ్య సముదాయాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. యజమానుల కాసుల కక్కుర్తి, అధికారుల మామూళ్ల మత్తు వెరసి.. అమాయకుల ప్రాణాలు నిప్పుల కుంపటిలో కాలి బూడిదవుతున్నాయి. నాంపల్లి బచ్చాస్ ఫర్నీచర్ షోరూమ్ ప్రమాదం కేవలం 'యాక్సిడెంట్' కాదు.. అది వ్యవస్థ చేసిన 'నేరపూరిత హత్య

పరిశోధనాత్మక పాత్రికేయులు  వీ.జీ. (వేణుగోపాల్)✍️

​హైదరాబాద్:

నాంపల్లి అగ్నిప్రమాదం వెనుక అక్రమాల గుట్ట : నిబంధనలు 'బూడిద'.. లంచాలదే 'హవా'...

రాజధాని నగరంలో మరోసారి అగ్నిప్రమాదం ఐదు ప్రాణాలను బలితీసుకుంది. నాంపల్లిలోని బచ్చాస్ ఫర్నీచర్ షోరూమ్‌లో సంభవించిన ప్రమాదం కేవలం 'ప్రమాదం' కాదు, అది నిబంధనల ఉల్లంఘనలతో జరిగిన 'నేరపూరిత హత్య'గా పోలీసులు నిర్ధారించారు. పార్కింగ్ కోసం కేటాయించిన సెల్లార్‌ను గోడౌన్‌గా మార్చి, రసాయనాలు నింపిన యజమాని స్వార్థం ఐదుగురిని సజీవ దహనం చేసింది. అక్రమ కట్టడాలు, ఇరుకైన సందుల్లో ఆరంతస్తుల భవనాలు వెలుస్తున్నా కళ్లు మూసుకుంటున్న పురపాలక, అగ్నిమాపక అధికారుల తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ​కటకటాల్లో యజమాని.. హంతక సెక్షన్లతో కేసు
​షోరూం యజమాని సతీష్ బచ్చాను అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వల్ల జరిగిన ప్రాణనష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయనపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 110 (నేరపూరిత నరహత్యకు ప్రయత్నం) కింద కేసు నమోదు చేశారు. సెల్లార్‌లో ఫర్నీచర్‌తో పాటు అగ్గిని రాజేసే కెమికల్స్ నిల్వ చేయడం, సిబ్బందికి అక్కడే వసతి కల్పించడం పెను ప్రమాదానికి దారితీసింది.

​అనుమతులు ఇలా.. అక్రమాలు అలా!

​ఒక వాణిజ్య భవనం నిర్మించాలంటే ఉండాల్సిన కనీస నిబంధనలు గాలికి ఎగురుతున్నాయి.

​పార్కింగ్ మాయం: 
అనుమతుల్లో సెల్లార్‌ను పార్కింగ్‌కు చూపిస్తున్న యజమానులు, నిర్మాణం పూర్తయ్యాక దానిని వ్యాపారాలకు వాడుకుంటున్నారు.

​సెట్ బ్యాక్స్ లేవు: 
భవనం చుట్టూ అగ్నిమాపక శకటం తిరిగేందుకు ఖాళీ స్థలం (Setbacks) ఉండాలి. కానీ, అంగుళం కూడా వదలకుండా ఐదారు అంతస్తులు నిర్మిస్తున్నారు.

​ఇరుకైన దారులు:

ఇరుకు సందుల్లో భారీ షాపింగ్ మాల్స్ నిర్మిస్తున్నా అధికారులు మౌనంగా ఉంటున్నారు.
​లోతైన సెల్లార్లు: అనుమతులు లేకుండానే అదనపు సెల్లార్లు తవ్వుతూ పక్క భవనాల భద్రతను సైతం ముప్పులో పడేస్తున్నారు.
​ఫైర్ ఎన్‌వోసీల విక్రయం?
​నిబంధనల ప్రకారం 15 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తున్న వాణిజ్య భవనాలకు ఫైర్ ఎన్‌వోసీ (NOC) తప్పనిసరి. కానీ, క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే అగ్నిమాపక అధికారులు అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
​అవినీతికి ఆస్కారం: ఫైర్ సేఫ్టీ పరికరాలు లేకున్నా, కేవలం పత్రాల మీద ఉన్నాయని చూపిస్తూ 'ముడుపుల' మత్తులో అధికారులు క్లియరెన్స్ ఇస్తున్నారు.
​తనిఖీల ప్రహసనం: ఏటా జరగాల్సిన ఫైర్ ఆడిట్ కేవలం మొక్కుబడిగా సాగుతోంది. ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే అధికారులు హడావుడి చేసి మౌనంగా ఉండిపోతున్నారు.
​తీసుకోవాల్సిన రక్షణ చర్యలు ఇవే..
​అగ్నిమాపక వ్యవస్థ: ప్రతి అంతస్తులో ఫైర్ స్ప్రింక్లర్లు, స్మోక్ డిటెక్టర్లు, ఫైర్ ఎక్స్‌టింగూషర్లు ఉండాలి.
అత్యవసర ద్వారాలు: అగ్నిప్రమాదం జరిగినప్పుడు బయటకు వెళ్లేందుకు 'ఎమర్జెన్సీ ఎగ్జిట్' ద్వారాలు తప్పనిసరి. ఇవి సామానుతో నిండి ఉండకూడదు.
​నీటి నిల్వ: భవనం పైన లేదా కింద అగ్నిమాపక అవసరాల కోసం ప్రత్యేక వాటర్ ట్యాంక్ ఉండాలి.
​విద్యుత్ ఆడిట్: పాత భవనాల్లో వైరింగ్ మార్చకపోవడం వల్ల షార్ట్ సర్క్యూట్లు జరుగుతున్నాయి. క్రమం తప్పకుండా ఎలక్ట్రికల్ ఆడిట్ చేయాలి.
​కఠిన చర్యలు తీసుకుంటేనే మార్పు!
​అక్రమ కట్టడాలకు సహకరించే టౌన్ ప్లానింగ్ అధికారులు, ముడుపులు తీసుకునే ఫైర్ ఆఫీసర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. పార్కింగ్ లేని భవనాలను సీజ్ చేయడంతో పాటు, అనుమతులు లేని అంతస్తులను కూల్చివేయాలి. అప్పుడే అమాయకుల ప్రాణాలు గాలిలో కలవకుండా ఉంటాయి.

About The Author