సంస్కారవంతమైన విద్యకు నిలయాలు శిశుమందిరాలే

  • ​బడంగ్‌పేటలో సరస్వతి శిశుమందిర్‌ పాఠశాల భవన ప్రారంభోత్సవం
  • ముఖ్య అతిథులుగా లింగం సుధాకర్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పారిజాత నరసింహారెడ్డి

సంస్కారవంతమైన విద్యకు నిలయాలు శిశుమందిరాలే

​బడంగ్‌పేట: 

సంస్కృతి, సంప్రదాయాలతో కూడిన విద్యను అందిస్తూ సమాజంలో ఉత్తమ పౌరులను తీర్చిదిద్దడంలో సరస్వతి శిశుమందిర్ పాఠశాలలు అగ్రగామిగా నిలుస్తున్నాయని విద్యాపీఠం దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి అన్నారు. గురువారం బడంగ్‌పేటలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ 42వ వార్షికోత్సవం, నూతన భవన ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.
​వివేకానందుడి విగ్రహావిష్కరణ
​పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన మొదటి రెండు అంతస్తులను ప్రారంభించడంతో పాటు, స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం ఆశించకుండా, వేలాది మంది విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తూ ఉన్నత స్థాయికి చేర్చుతున్న యాజమాన్యం కృషి అభినందనీయమన్నారు. ఇక్కడి విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లుగా వివిధ రంగాల్లో రాణిస్తున్నారని గుర్తుచేశారు.
​వ్యక్తిత్వ వికాసానికి వేదికలు
​మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, వ్యక్తిత్వ వికాసానికి శిశుమందిరాలే పురుడు పోస్తున్నాయని కొనియాడారు. "గతంలో ఇళ్ల వద్దే పెద్దల ద్వారా పిల్లలకు రామాయణ, భారత గాథలు తెలిసేవని, ప్రస్తుతం మారుతున్న కాలంలో ఆ బాధ్యతను ఈ పాఠశాలలు స్వీకరించడం విశేషం" అని పేర్కొన్నారు. సమాజం బాగుండాలంటే ఇలాంటి విద్యా సంస్థల అవసరం ఎంతో ఉందన్నారు.
​దాతలకు సన్మానం
​కార్యక్రమంలో భాగంగా పాఠశాల భవన నిర్మాణానికి సహకరించిన దాతలను ఘనంగా సన్మానించారు. ఈ వేడుకల్లో మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, పతాకమురి శ్రీనివాసరావు, పాఠశాల అధ్యక్షుడు మదన్ మోహన్ ధరక్, సామ సంజీవరెడ్డి, ఉపాధ్యక్షుడు సమరసింహారెడ్డి, కార్యదర్శి దొడ్డి మల్లికార్జున్, ఉప కార్యదర్శి రామిడి శురకర్ణ రెడ్డి, గణేష్ గౌడ్, కిరణ్ గౌడ్, నరసింహగౌడ్ తో పాటు మాజీ కార్పొరేటర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

About The Author