మా పొట్ట కాడి కూడు కొడితే ఊరుకోం : స్వచ్ఛ ఆటో రిక్షా కార్మికులు
ఎల్బీనగర్:
రాంకీ సంస్థ ఆటో రిక్షా కార్మికుల పొట్ట గొట్టే విధంగా వ్యవహరిస్తుందని, ప్రభుత్వ ఒప్పందాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ స్వచ్ఛ ఆటో రిక్షా కార్మికుల యూనియన్ హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు గోపాల్ నాయక్ డిమాండ్ చేశారు.ఇంటి పన్నుతోనే చెత్త సేకరణ డబ్బులు వసూలు చేసే విధంగా మున్సిపల్ అధికారులు రాంకీ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎల్బీనగర్ సర్కిల్ కార్యాలయం ముందు గురువారం గ్రేటర్ హైదరాబాద్ స్వచ్చ ఆటో కార్మికుల సంఘం అధ్యక్షులు కాట్రవత్ గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆటో కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గోపాల్ నాయక్ మాట్లాడుతూ కార్మికుల పొట్టను కొడుతున్న రాంకీ సంస్థకు వ్యతిరేకంగా ఈనెల 23వ తేదీన జిహెచ్ఎంసి కార్యాలయం ముందు పెద్ద ఎత్తున కార్మికులు ఆందోళనకు దిగుతామన్నారు. మా తాత, తండ్రుల నుండి చెత్త సేకరణ చేసి జీవనం కొనసాగిస్తున్నామని, మా జీవనోపాధిపై ఈ ప్రభుత్వం దెబ్బతీస్తుందన్నారు. చెత్త సేకరించగా వచ్చిన డబ్బులతోనే మా కుటుంబ పోషణ జరుగుతుందని మా పొట్ట కాడి కూడు గొడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇప్పుడు ప్రభుత్వం చెత్త సేకరణ డబ్బులు కూడా ఇంటి పన్నుల్లో వసులు చేసి మా కడుపు కొట్టాలని చూడడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే తన వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో వంశ రాజు, అర్జున్, శేఖర్, మచ్చ గిరి, చెక్క శీను, వీరస్వామి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
