యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం

*ఒత్తిడిని జయించేందుకు నిత్య సాధన అవసరం: మంత్రి దామోదర్ రాజనర్సింహ*

యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం

హైదరాబాద్:

యోగా సాధన ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఒత్తిడిని సమర్థవంతంగా జయించవచ్చని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక'లో భాగంగా నిర్వహిస్తున్న హెల్త్ వీక్ సందర్భంగా శనివారం గచ్చిబౌలి స్టేడియంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నేటి వేగవంతమైన జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడికి, ఇతర అనారోగ్య సమస్యలకు యోగా ఒక సమగ్ర పరిష్కారమని పేర్కొన్నారు. యోగా కేవలం వ్యాయామ పద్ధతి మాత్రమే కాదని, అది ఒక ఆరోగ్యకరమైన జీవన విధానమని స్పష్టం చేశారు. ప్రతిరోజూ యోగా ఆచరించడం వల్ల శరీరానికి దృఢత్వం, మనసుకు ప్రశాంతత లభిస్తాయని, తద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని వివరించారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెంపొందడమే కాకుండా, జీవనశైలి సంబంధిత వ్యాధులను నివారించవచ్చన్నారు.

*విద్యార్థ దశ నుంచే అలవాటు కావాలి*
ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి యోగా కీలకమని, ప్రతి ఒక్కరూ దీనిని నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చిన్న వయస్సు నుంచే యోగాను అలవాటు చేయడం అత్యంత అవసరమని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. యోగా పట్ల అవగాహన పెంపొందించేందుకు జిల్లాలో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టినా చోగ్తూ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె. లలితాదేవి, హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ షీబా హయత్, డాక్టర్ పూనం, డిపిఓ అక్రమ్ తదితర అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-04-10 at 19.32.12

About The Author