రోడ్డు పనుల్లో నాణ్యత పాటించాలి: కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి.
ఎల్బీనగర్:
రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని బి.ఎన్. రెడ్డి నగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం డివిజన్ పరిధిలోని సచివాలయ నగర్ కాలనీలో రూ. 64 లక్షల వ్యయంతో చేపట్టిన సిసి రోడ్డు నిర్మాణ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనుల్లో ఎక్కడా రాజీ పడకూడదని, ఇంజనీరింగ్ నిబంధనల ప్రకారం లెవెల్స్ సరిచూసుకుంటూ నిర్మాణం చేపట్టాలని సూచించారు. కాలనీవాసులకు రాకపోకలకు ఇబ్బంది కలగకుండా, యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు, అధికారులకు స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల విషయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు శ్రీధర్, సుధీర్, పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్ విభాగం సూపర్వైజర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
