డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను విమర్శించే నైతిక హక్కు సిపిఎం పార్టీ నాయకులకు లేదు
ఖమ్మం బ్యూరో:
- ప్రజా ఉద్యమాల పేరుతో ఉనికి కోల్పోతున్న పార్టీని కాపాడుకునేందుకు దొంగ పాదయాత్ర చేస్తున్న సిపిఎం నాయకులు
- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికి కాపాడుకునేందుకు పాదయాత్ర చేసిన సిపిఎం పార్టీ
- పదేళ్ల దొరల పాలనలో పేదల సమస్యలు సిపిఎం కు గుర్తుకు రాలేదా

మధిర నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఓటమి ఎరగని నేత ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారిపై ఆరోపణలు చేసే నైతిక హక్కు సిపిఎం పార్టీకి, ఆ పార్టీ నాయకులకు లేదన్నారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం డిసిసి కార్యదర్శి పైడిపల్లి కిషోర్ కుమార్, మండల అధ్యక్షులు గాలి దుర్గారావు, క్లస్టర్ ఇంచార్జ్ ఎర్రంశెట్టి సుబ్బారావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... రాష్ట్రంలో జిల్లాలో గ్రామాల్లో చివరకు ఒక అంకె నుండి పదుల అంకెల్లో కార్యకర్తలు చేరారు అంటే ఆ పార్టీ ఏం చేస్తుందో ముందు ఆ సిపిఎం నాయకులు గమనించాలన్నారు. నాయకుల ఎజెండాతోనే వాళ్ళ అభివృద్ధి తప్ప కార్యకర్తల గురించి పట్టించుకోని సిపిఎం పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ నీ విమర్శించడం తగదన్నారు. ఈ రోజు సిపిఎం పార్టీ గ్రామస్థాయి నుండి జిల్లా రాష్ట్ర స్థాయి వరకు నాయకులు అభివృద్ధి చెందారా? ప్రజా సమస్యల పేరుతో ఏం చేస్తున్నారు ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వారి పార్టీ ఉనికి కోసం ఇందిరమ్మ ఇళ్ల పేరుతో పాదయాత్ర చేపట్టడం దౌర్భాగ్యం అన్నారు. దొరల పాలనలో ఘడీలలో బందీ అయిన సమాజాన్ని పీపుల్స్ మార్చు పాదయాత్ర తో నిస్తేజం లో వున్న సమాజాన్ని మేల్కొలిపి ప్రజాపాలనకు నాంది పలికిన గొప్ప దార్శనికుడు అయిన భట్టి విక్రమార్క పైన ప్రేలాపనలు మానుకోకపోతే ప్రజా క్షేత్రం లో చావు దెబ్బ తప్పదు అని అన్నారు. సిపిఎం జిల్లా నాయకులు నున్న నాగేశ్వరావు, పోతీనేని సుదర్శన్ కి మతి చలించి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పై మాట్లాడుతున్నారన్నారు. ఈ రోజు రాష్ట్రంలో ప్రజా రంజక పాలన నడుస్తుంటే మీ స్వార్థ రాజకీయాల కోసం పాదయాత్ర చేయడం దారుణం అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు కాకముందే అనేక పేద ప్రజల అభ్యున్నతి కోసం పథకాలు ప్రవేశపెట్టారన్నారు. మదిర నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ముందుంచేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నిరంతరం పనిచేస్తున్నారు అన్నారు.అటు వంటి నాయకుడిపై ఇల్లు ముట్టడిస్తాం అని అనడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఆయన ఉండేది సొంత ఇంటిలో కాదని అది కూడా ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రజా భవన్లో అని నిత్యం అక్కడ ప్రజల సమస్యల ఎన్నో పరిష్కారమవుతాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఎన్నో ఏళ్ల చిరకాల కలయిన రేషన్ కార్డులను రాజకీయాలకతీతంగా పంచింది. ప్రతి నిరుపేద కుటుంబానికి సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ అందజేస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో డ్రామాలకు తెరలేపిన సిపిఎం నాయకులు గ్రామాల్లో నిరుపేదలకు ఇల్లు రావడం లేదనటం సిగ్గుచేటు అన్నారు. ప్రతి నిరుపేదకు సొంత ఇంటి కల నెరవేరే ఎందుకు ఎంతో దృఢ సంకల్పంతో ఎక్కడా లేనివిధంగా అయిదు లక్షలు లబ్ధిదారునికి నేరుగా ఖాతాలో జమ చేస్తూ అర్హులైన పేదలను ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా అధికారులే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారన్నారు. గతంలో జరిగిన గోవిందపురం ఎల్ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమం లో అన్ని పార్టీ ల నాయకులని వేదిక పైన కూర్చోబెట్టిన ఘనత భట్టి విక్రమార్కకే దక్కుతుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు పిల్లలమర్రి నాగేశ్వరావు, కందుల పాపారావు, మరీదు శ్రీనివాసరావు, దస్తగిరి, బోయినపల్లి నరేష్, సత్యనారాయణ మండల నాయకులు పాల్గొన్నారు.
