బాలాపూర్‌లో జనవరి 24న 'ధర్మ రక్షణ సభ'
- రోహింగ్యాల అక్రమ చొరబాట్లపై 'అఖిల పక్షం' సమరభేరి..
- భద్రతపై రాజీలేని పోరాటం చేద్దాం: కాంగ్రెస్ నాయకులు చిగిరింత నరసింహారెడ్డి పిలుపు.
బాలాపూర్:
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పరిసర ప్రాంతాల్లో రోహింగ్యాలు అక్రమంగా మన దేశంలోకి చొరబడి స్థిరపడ్డారు, తద్వారా పొంచి ఉన్న భద్రతా ముప్పుపై స్థానిక నాయకులు గళమెత్తారు. గణేష్ సేన ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన నిర్వహించ తలపెట్టిన ‘ధర్మ రక్షణ సభ’ ద్వారా తమ నిరసనను గట్టిగా వినిపించాలని అఖిల పక్షం నిర్ణయించింది. సోమవారం బాలాపూర్ గణేష్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో నాయకులు పాల్గొని సభ ఏర్పాట్లపై చర్చించారు.
పార్టీలకు అతీతంగా పోరాడదాం
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ వైస్ చైర్మన్ చిగిరింత నరసింహారెడ్డి మాట్లాడుతూ.. బాలాపూర్ పరిసరాల్లో అక్రమంగా స్థిరపడుతున్న రోహింగ్యాల వల్ల స్థానికులు తీవ్ర అభద్రతా భావానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. "చొరబాటుదారులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇది కేవలం ఒక వర్గానికి సంబంధించిన సమస్య కాదు, స్థానిక ముస్లిం సోదరులు కూడా దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే రాజకీయాలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి పోరాడాల్సిన అవసరం ఉంది" అని ఆయన పిలుపునిచ్చారు.
పార్లమెంటులో చర్చకు డిమాండ్:
అక్రమ వలసల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, కేంద్రంపై కూడా ఒత్తిడి పెంచాలని నాయకులు తీర్మానించారు. ఈ సమస్యపై పార్లమెంటులో చర్చ జరిగేలా అన్ని రాజకీయ పార్టీల సహకారం కోరతామని వెల్లడించారు. బాలాపూర్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, చొరబాటుదారుల ఏరివేతలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
