డీజిల్ దందా..
- -ట్రై మున్సిపల్ కార్పొరేషన్ లలో గోలమాల్
- -రూ. కోట్ల ప్రజాధనం లూటీ
- -ఏఈల అవతారమెత్తిన ఫోర్‌మెన్
- -ఆన్‌లైన్ కూపన్లపై అక్రమ సంతకాలు.
- -సమగ్ర విచారణకు ‘ఫోరమ్ ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్’ డిమాండ్
- -ట్రై మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ జేయేష్ రంజన్ ఐఏఎస్ దృష్టి సారించాలి.
కమిషనర్ ఆదేశాలను తుంగలో తొక్కి, ఏఈల అవతారమెత్తిన ఫోర్‌మెన్‌లు నకిలీ డీజిల్ కూపన్లపై అక్రమ సంతకాలతో భారీ ఇంధన దందాకు తెరలేపారు. వాహనాల జీపీఎస్ డేటాకు, డీజిల్ వినియోగానికి పొంతనే లేదు. ఈ దందాపై ‘ఫోరమ్ ఫర్ యాంటీ కరప్షన్’ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఏసీబీ లేదా సీఐడీతో సమగ్ర విజిలెన్స్ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.
హైదరాబాద్:
గ్రేటర్ హైదరాబాద్..మల్కాజ్గిరి.. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లలో ఇంధన సరఫరా పేరుతో భారీ కుంభకోణం నడుస్తోంది. మున్సిపల్ కమిషనర్ లు జారీ చేసిన స్పష్టమైన ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ, కొందరు అధికారులు, సిబ్బంది కుమ్మక్కై రూ.కోట్ల ప్రభుత్వ ధనాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి.ఈ క్రమంలో ‘ఫోరమ్ ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్’ సంస్థ ఈ వ్యవహారంపై ఘాటైన ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖను విడుదల చేయడంతో ట్రై మున్సిపల్ కార్పొరేషన్ సర్కిళ్లలో కలకలం రేగింది.
జీహెచ్‌ఎంసీ వాహనాలకు ఇంధనాన్ని కేటాయించే ఆన్‌లైన్ డీజిల్ కూపన్లపై కేవలం ,సహాయక ఇంజనీర్లు (అసిస్టెంట్ ఇంజనీర్-ఏ.ఇ) మరియు,విభాగపు ఇంజనీర్లు (డివిజనల్ ఇంజనీర్స్) మాత్రమే సంతకాలు చేయాలని కమిషనర్ గతంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
*మూడేళ్ల లెక్కలు తేలాల్సిందే!
గత మూడేళ్లుగా ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ కాలంలో ఫోర్‌మెన్‌లు డిజిటల్ లేదా మాన్యువల్ పద్ధతిలో ఆమోదించిన ఇంధన కూపన్ల సంఖ్య ఎంత? వాటి ద్వారా విడుదలైన డీజిల్ పరిమాణం, దాని విలువ ఎంత? అనే అంశాలపై ఇప్పటివరకు ఎలాంటి అంతర్గత ఆడిట్ జరగకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
*శాస్త్రీయ మరియు సాంకేతిక ఆధారాల అవశ్యకత:
జీహెచ్‌ఎంసీ, ఎం.ఎం.సి, సి.ఎం.సిలోని ప్రతి వాహనానికి లాగ్‌బుక్ (Log Book) నిర్వహణ, ఇంధన వినియోగం మరియు వాహనం తిరిగిన దూరానికి (Kilometer-to-Fuel Ratio) ఖచ్చితమైన సమతుల్యత ఉండాలి. ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయి పరిశీలనలో వాహనాల జిపిఎస్ (GPS) డేటాకు, ఆన్‌లైన్ కూపన్ల ద్వారా జారీ అయిన డీజిల్ పరిమాణానికి ఎక్కడా పొంతన కుదరడం లేదని ప్రాథమిక ఆధారాలు చెపుతున్నాయి.
*నకిలీ కూపన్లు.. ఫోర్జరీ ముఠా?
ఈ వ్యవహారంలో కేవలం అధికార దుర్వినియోగమే కాకుండా, పెద్ద ఎత్తున నకిలీ కూపన్ల సృష్టి, సంతకాల ఫోర్జరీ వంటి క్రిమినల్ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వాహనాలు షెడ్డుకే పరిమితమైనా, కాగితాల్లో మాత్రం వందల లీటర్ల డీజిల్ వినియోగించినట్లు చూపిస్తూ నిధులు డ్రా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ముమ్మాటికీ ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే.
*విజిలెన్స్ విచారణకు డిమాండ్
ఈ భారీ ఇంధన కుంభకోణంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ తక్షణమే స్పందించాలని ‘ఫోరమ్ ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్’ డిమాండ్ చేసింది. దీనిపై ప్రత్యేక ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించడంతో పాటు, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం (CID) లేదా అవినీతి నిరోధక శాఖ (ACB) కు విచారణను అప్పగించాలని కోరింది.
బాధ్యులైన అధికారుల నుండి నష్టాన్ని రికవరీ చేయాలని, డీజిల్ కూపన్ల జారీకి సంబంధించిన పూర్తి డేటాను పారదర్శకంగా ప్రజల ముందు ఉంచాలని పౌర సమాజం కోరుతోంది. కమిషనర్ ఆదేశాల ఉల్లంఘనపై అంతర్గత విచారణ జరిపి, ఈ ‘డీజిల్ మాఫియా’ వెనుక ఉన్న అసలు సూత్రధారులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
