జిహెచ్ఎంసిలో ‘డీజిల్’ దొంగలు..

  • నిబంధనలు తుంగలో తొక్కి డిజిల్ అమ్ముకొని రూ. కోట్ల ప్రజాధనం లూటీ!
  • *కమిషనర్ సర్కులర్ 4089 ధిక్కరణ.. అసిస్టెంట్ ఇంజనీర్ల అవతారమెత్తిన ఫోర్‌మెన్‌లు!
  • *ఆన్‌లైన్ కూపన్లు ముద్రించి, నకిలీ స్టాంపులతో దొంగ అమ్మకాలు..
  • *ఉనికిలో లేని వాహనానికీ డీజిల్ మోత.. కవాడిగూడ వర్క్‌షాప్‌లో నెలకు రూ. 35 లక్షల నకిలీ రిపేర్ బిల్లులు!
  • *కంటితుడుపుగా మారిన విజిలెన్స్.. ‘ఫోరమ్ ఫర్ యాంటీ కరప్షన్’ ఆధ్వర్యంలో ఏసీబీ విచారణకు డిమాండ్.
  • ట్రై కార్పొరేషన్ స్పెషల్ అధికారి జయేష్ రంజాన్ ఐఏఎస్ చర్యలు ఎక్కడ..!
  • మున్సిపల్ శాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలి..!

జిహెచ్ఎంసిలో ‘డీజిల్’ దొంగలు..

*హైదరాబాద్ :

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి), మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎం.ఎం.సి), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సి.ఎం.సి) విభాగాల్లో ఇంధన సరఫరా మరియు వాహనాల మరమ్మత్తుల పేరుతో అక్షరాలా కోట్ల రూపాయల ప్రజాధనం పక్కదారి పడుతోంది. ఉన్నతాధికారుల ఆదేశాలను, కమిషనర్ జారీ చేసిన స్పష్టమైన నిబంధనలను క్షేత్రస్థాయి సిబ్బంది పూర్తిగా బేఖాతరు చేస్తున్నారు. కమిషనర్ ఆర్డర్‌ను ధిక్కరిస్తూ, నకిలీ కూపన్లు, ఫోర్జరీ సంతకాలతో సాగుతున్న ఈ 'డీజిల్ మాఫియా' వ్యవహారంపై ‘ఫోరమ్ ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్’ సంస్థ సంచలన ఆధారాలను బయటపెట్టింది. ఉన్నతాధికారుల ముడుపుల అండతోనే ఈ సమాంతర దోపిడీ వ్యవస్థ నడుస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.WhatsApp Image 2026-06-09 at 19.37.57

*కమిషనర్ సర్కులర్ నెం. 4089 భేఖాతరు!
జీహెచ్‌ఎంసీ పరిధిలోని వాహనాలకు ఇంధనాన్ని కేటాయించే విషయంలో మున్సిపల్ కమిషనర్ స్పష్టమైన 'సర్కులర్ నెంబర్ 4089/జిహెచ్‌ఎంసి/హెచ్&ఎస్/2025' ను జారీ చేశారు. దీని ప్రకారం కేవలం సహాయక ఇంజనీర్లు (ఎ.ఈ) మరియు విభాగపు ఇంజనీర్లు (డి.ఈ) లాంటి ఉన్నతాధికారులు మాత్రమే ఆన్‌లైన్ డీజిల్ కూపన్లను పరిశీలించి, ఇష్యూ చేయాల్సి ఉంటుంది.
కానీ క్షేత్రస్థాయిలో సీన్ రివర్స్ అయింది. వర్క్‌షాప్‌లలో పనిచేసే ఫోర్‌మెన్‌లు  తామే ఉన్నతాధికారులమన్నట్లుగా అవతారమెత్తారు. ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండానే ‘యాక్టింగ్ ఏఈ/డిఈ’లుగా చలామణీ అవుతూ యధేచ్ఛగా కూపన్లు జారీ చేస్తున్నారు.
దొంగ కూపన్ల దందా.. కోట్లల్లో గండి:
 ముఖ్యంగా మార్చి నెలకు సంబంధించిన ఆన్‌లైన్ డీజిల్ కూపన్లను ముందే ప్రింట్ తీసి, వాటిపై ప్రభుత్వ స్టాంపులు వేసి ఫోర్‌మెన్‌లు దొంగచాటుగా భారీ ఎత్తున అమ్ముకున్నట్లు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.

*ఆర్టీఓ రికార్డుల్లో లేని వాహనానికి డీజిల్ ఎలా కొట్టారు?
ఈ కుంభకోణంలో జరుగుతున్న అక్రమాలకు పరాకాష్టగా ఒక నకిలీ వాహనం ఉదంతం వెలుగుచూసింది. "AP 09 W 3591" నెంబరు గల వాహనానికి జీహెచ్‌ఎంసీ నుంచి భారీగా డీజిల్ కూపన్లు ఇష్యూ అయ్యాయి. అయితే, రికార్డులను పరిశీలించగా అసలు ఈ నెంబరుతో కూడిన ఏ వాహనమూ ఆర్టీఓ  రికార్డుల్లోనే లేదు! లేని వాహనానికి నెలకు వందల లీటర్ల డీజిల్ ఎలా కేటాయించారు? ఆ ఇంధనం ఎవరి జేబుల్లోకి వెళ్ళింది? దీని వెనుక ఉన్న ఫోర్జరీ ముఠా ఎవరు? అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది.

*కవాడిగూడ వర్క్‌షాప్‌లో ‘మరమ్మత్తుల’ మాయాజాలం!
డీజిల్ దందా మాత్రమే కాదు, జీహెచ్‌ఎంసీ ట్రాన్స్పోర్ట్ సెక్షన్ లో అంతకు మించిన స్కామ్ నడుస్తోంది. ముఖ్యంగా కవాడిగూడ పరిధిలోని ట్రాన్స్పోర్ట్ సెక్షన్ లో వాహనాల రిపేర్లు మరియు మరమ్మత్తుల పేరుతో అక్రమాలకు తెరలేపారు. వాహనాలు షెడ్డులోనే మూలుగుతున్నా, కండిషన్‌లో ఉన్నా సరే.. ప్రతి నెలా దాదాపు 'రూ. 35 లక్షల దొంగ బిల్లులు' సృష్టిస్తున్నారు. ఈ నకిలీ రిపేర్ బిల్లుల ద్వారా ఏటా కోట్ల రూపాయల నిధులను అక్రమార్కులు నొక్కేస్తున్నారని ప్రధాన ఆరోపణ.

జీపీఎస్ డేటాకు, కూపన్లకు పొంతనే లేదు!
ఆధునిక సాంకేతికత ప్రకారం ప్రతి మున్సిపల్ వాహనానికి లాగ్‌బుక్ తో పాటు జీపీఎస్  ట్రాకింగ్ ఉండాలి. వాహనం తిరిగిన కిలోమీటర్లకు, వినియోగించిన ఇంధనానికి ( కిలోమీటర్ ఫ్యూయల్ రేషియో) లెక్క సరిపోవాలి. కానీ, ప్రాథమిక ఆధారాల ప్రకారం వాహనాల జీపీఎస్ డేటాకు, ఆన్‌లైన్ కూపన్ల ద్వారా జారీ అయిన డీజిల్ పరిమాణానికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. వాహనాలు రోడ్డెక్కకుండానే, కేవలం కాగితాల్లోనే వేల కిలోమీటర్లు తిరిగినట్లు చూపిస్తూ డీజిల్ ముంచేస్తున్నారు.WhatsApp Image 2026-06-09 at 19.30.42

*విజిలెన్స్ కళ్ళు మూసిందా? ఏసీబీ విచారణకు డిమాండ్!
ఈ భారీ కుంభకోణం గత మూడేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నా.. జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉన్నతాధికారులకు సైతం ఈ అక్రమ రిపేర్ల స్కామ్, డీజిల్ దందాలో ‘నెలవారీ మామూళ్లు’ అందుతుండటం వల్లే విజిలెన్స్ విభాగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ‘ఫోరమ్ ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్’ సంస్థ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు బహిరంగ లేఖ రాస్తూ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేసింది.
 * ఈ వ్యవహారంపై ప్రత్యేక ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలి.
 * స్టేట్ విజిలెన్స్ మరియు అవినీతి నిరోధక శాఖ (ACB) కు ఈ ఆధారాలను అప్పగించి సమగ్ర విచారణ జరిపించాలి.
 * నకిలీ కూపన్లు సృష్టించిన ఫోర్‌మెన్‌లపై, వారికి సహకరించిన ఉన్నతాధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
 * లూటీ చేసిన ప్రజాధనాన్ని బాధ్యుల నుంచి రికవరీ చేయాలని పౌర సమాజం ముక్తకంఠంతో కోరుతోంది.

మరిన్ని ఆధారాలతో రేపటి కథనంలో..WhatsApp Image 2026-06-09 at 19.30.43WhatsApp Image 2026-06-09 at 19.30.42 (1)

About The Author