మధు ఎస్కి చేతుల మీదుగా 350 మంది కార్మికులకు 'బీఓసీ' కార్డుల పంపిణీ
హయత్ నగర్:
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని రాజీవ్ గాంధీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్టీయూసీ) ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు (బీఓసీ) గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. హయత్ నగర్ లోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ చార్జి, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాస్కీ గౌడ్ చేతుల మీదుగా గురువారం 50 మంది కార్మికులకు ఈ కార్డులను అందజేశారు. దీంతో ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఐఎన్టీయూసీ ద్వారా మొత్తం 350 మంది కార్మికులకు ఈ కార్డులు లభించినట్లయింది.
ఈ సందర్భంగా మధుయాస్కీ గౌడ్ మాట్లాడుతూ.. గతంలో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ హయాంలో తీసుకువచ్చిన అసంఘటిత కార్మిక సామాజిక భద్రత చట్టం వల్ల నేడు రాష్ట్రంలో 17 లక్షల మంది కార్మికులకు భరోసా లభిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందనడానికి ప్రమాద బీమా ఎక్స్‌గ్రేషియాను రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడమే నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం కార్మిక కుటుంబాల్లో ధైర్యాన్ని నింపుతుందన్నారు.
