భైంసా మున్సిపల్ సిబ్బందికి నెస్లే సంస్థ రేషన్ కిట్ల పంపిణీ
106 మంది పారిశుద్ధ్య కార్మికులకు లబ్ధి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా:
భైంసా మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలను గౌరవిస్తూ నెస్లే కంపెనీ ఆధ్వర్యంలో 106 మంది మున్సిపల్ శానిటేషన్ కార్మికులకు రేషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం భైంసా మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మరియు ఇన్‌చార్జ్ మున్సిపల్ కమిషనర్ అజ్మీరా సంకేత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్మికులకు రేషన్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “కరోనా కాలం అయినా, వర్షాకాలంలోనైనా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అహర్నిశలు కష్టపడే మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమైనవి. వీరి కృషి వల్లే భైంసా పట్టణం పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటుంది” అని అన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తిస్తూ నెస్లే కంపెనీ రోజువారీ అవసరాలకు ఉపయోగపడే ఆహార ధాన్యాలతో కూడిన రేషన్ కిట్లను బహుమతిగా అందించడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొని రేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
