వృద్ధాశ్రమానికి రూ. లక్ష విరాళం
ఘనంగా బిజుమళ్ళ మాధవ సూర్యనారాయణ శర్మ సిద్ధాంతి స్మారక ట్రస్ట్ 16వ వార్షికోత్సవం
వనస్థలిపురం:
సమాజ సేవయే పరమావధిగా గత 16 ఏళ్లుగా సాగుతున్న శ్రీ బిజుమళ్ళ మాధవ సూర్యనారాయణ శర్మ సిద్ధాంతి స్మారక సేవ భారతి ట్రస్ట్ మరోసారి తన ఉదారతను చాటుకుంది. ట్రస్ట్ 16వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని (మార్చి 23), 'నారాయణ సేవ' కార్యక్రమంలో భాగంగా వనస్థలిపురంలోని 'రెడీ టు సర్వ్' ఫౌండేషన్ వృద్ధాశ్రమానికి రూ. 1,00,000 (అక్షరాలా లక్ష రూపాయలు) ఆర్థిక సాయాన్ని అందజేసింది.
ధర్మ రక్షణే ధ్యేయం..
2010లో స్థాపించబడిన ఈ ట్రస్ట్ "ధర్మో రక్షతి రక్షితః" అనే నినాదంతో నిరంతరం సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటోంది. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ.. కేవలం వైదిక విద్యను, గోమాత సేవను ప్రోత్సహించడమే కాకుండా, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను ఆదుకోవడం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. వార్షికోత్సవ వేళ వృద్ధుల సేవకు ఈ విరాళం అందించడం సంతోషంగా ఉందన్నారు.
ట్రస్ట్ నుంచి అందిన ఈ భారీ విరాళం పట్ల 'రెడీ టు సర్వ్' ఫౌండేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఆశ్రమంలోని వృద్ధుల అవసరాలకు, వారి సంక్షేమానికి ఈ నిధులను వెచ్చిస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. సమాజంపై బాధ్యతతో ముందుకు వస్తున్న ఇటువంటి ట్రస్ట్‌ల సేవలు ఎందరికో స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
