పురపాలికలో సమస్యల పరిష్కారానికి కృషి
పుర కమిషనర్ కే రమేష్
సిద్దిపేట:
పురపాలికలో పాలకవర్గం సహకారంతో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో పాటు వార్డుల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుధ్యంపై మరింత దృష్టి పెట్టినట్లు దుబ్బాక పుర కమిషనర్ కే.రమేష్ కుమార్ తెలిపారు. దుబ్బాక పురపాలికకు నగరాభివృద్ధి పేరుతో మంజూరైన నిధులకు సంబంధించి,18వ వార్డులో చేపట్టిన మురుగు కాల్వల నిర్మాణ పనులను బుధవారం వార్డ్ కౌన్సిలర్ శ్రీరాం సరస్వతితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురపాలికలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు.త్వరలోనే ప్రతి వార్డులో తడి, పొడి, హానికర చెత్త సేకరణపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.స్వచ్ఛ దుబ్బాక సాధనకు ప్రజలందరూ తమతో సహకరించాలన్నారు.వార్డుల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు నాణ్యత ఉండే విధంగా చేపట్టాలని గుత్తేదారును కోరారు.ఈనెల 31వ తేదీలోగా పెండింగ్ లో ఉన్న ఆస్తి పన్ను బకాయిలను ప్రజలందరూ సకాలంలో చెల్లించాలని కోరారు. ప్రస్తుత వేసవి కాలంలో వార్డుల్లో ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వార్డుల్లో మురుగు కాలువల నిర్మాణం పూర్తయిన అనంతరము రహదారుల నిర్మాణం చేపడతామన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు శ్రీరాం నరేందర్, ఆకుల భరత్, వర్క్ ఇన్స్పెక్టర్ దిలీప్ తదితరులు ఉన్నారు.
