పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి 'భరోసా'
- జీహెచ్‌ఎంసీ ప్రత్యేక చొరవ.. ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలు
- మొబైల్ బస్సుల ద్వారా క్షేత్రస్థాయిలోనే పరీక్షలు
- 20 సర్కిళ్లలో పూర్తి.. 'కార్కినోస్' భాగస్వామ్యంతో మహత్తర కార్యం
హైదరాబాద్:
నగర పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమించే పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యంపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) 'మొబైల్' యుద్ధం ప్రకటించింది.
చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రాణాంతకంగా మారుతున్న క్యాన్సర్ మహమ్మారిని ప్రాథమిక దశలోనే తుడిచిపెట్టేందుకు నడుం బిగించింది. 'కార్కినోస్ హెల్త్ కేర్' భాగస్వామ్యంతో, ఇండియన్ క్యాన్సర్ సొసైటీ ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్న ఈ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలు కార్మికుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాయి.
అనేకమంది కార్మికులు అవగాహన లేక, ఆర్థిక స్థోమత సరిపోక ఆరోగ్య పరీక్షలకు దూరంగా ఉంటున్నారు. ఈ అడ్డంకిని తొలగిస్తూ, జీహెచ్‌ఎంసీ నేరుగా వారి వద్దకే వైద్య సేవలను తీసుకెళ్తోంది.
స్క్రీనింగ్ ఇలా: మొబైల్ వాహనాల్లోనే మహిళలకు రొమ్ము, గర్భాశయ ముఖద్వార, నోటి క్యాన్సర్ పరీక్షలు.. పురుషులకు ఓరల్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు..jpeg)
పర్యవేక్షణలో రాజీ లేదు
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ స్వయంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.
శుక్రవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఆయన సందర్శించి, సిబ్బందికి ధైర్యం చెప్పారు. ఇప్పటికే నగరంలోని 20 సర్కిళ్లలో విజయవంతంగా ఈ పరీక్షలు పూర్తి కావడం విశేషం.
అభిప్రాయాలు: "మా ఆరోగ్యంపై భరోసా పెరిగింది"
ప్రాథమిక దశలో గుర్తిస్తే మేలు
"పారిశుద్ధ్య కార్మికులపై ప్రత్యేక దృష్టి సారించి ఈ శిబిరం ఏర్పాటు చేయడం చాలా ప్రయోజనకరం.
వ్యాధిని మొదట్లోనే గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవడం సులభమని సిబ్బంది వివరిస్తున్నారు."
— శైలజ, జూనియర్ సహాయకులు, హెల్త్ సెక్షన్.
భయం పోయింది.. కృతజ్ఞతలు
"క్యాన్సర్ అంటే మాకు చాలా భయం ఉండేది. కానీ ఇక్కడి వైద్యులు ఆ భయాన్ని పోగొట్టారు.
పరీక్షలు చేయించుకున్నాం.. మా తోటి వారందరినీ చేయించుకోమని చెబుతున్నాం. మా ఆరోగ్యం కోసం ఈ చొరవ తీసుకున్న జీహెచ్‌ఎంసీకి కృతజ్ఞతలు."
