వినోదమా..? విలువల పెత్తనమా..?
- తెలుగు బిగ్ బాస్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు..
- యువతను పెడచెవిన పెడుతుందంటూ ఆగ్రహ జ్వాలలు..
- రేటింగ్ కోసం ఎంతకైనా తెగిస్తారా అంటున్న మేధావులు..
- అక్కడేదో జరుగుతున్నట్టు కటింగ్ ఇస్తూ.. చేస్తున్నది స్క్రిప్టెడ్ ప్రోగ్రాం..
- ముందే అన్నీ ప్రిపేర్ చేసి డ్రామా చేస్తున్నారా..?
- హౌస్ లో సీక్రెట్ కెమెరాలు వాడితే క్లోజులు, సజెషన్ షాట్లు ఎలా వస్తాయి..?
- బహిరంగ వ్యభిచారం అంటూ సీపీఐ నారాయణ ఆగ్రహం..
- వెంటనే బ్యాన్ చేసి నిర్వాహకులను శిక్షించాలంటూ డిమాండ్స్..
- ఒకే బెడ్ పై ఇద్దరు పరిచయం లేని ఆడ, మోగా ఎలా పడుకుంటారు..?
- ఈ కార్యక్రమాన్ని చూసి యూత్ ఏమి నేర్చుకోవాలి..?
- కుటుంబంలోని అందరూ ఇదే ప్రోగ్రామ్ చూస్తున్నారు.. ప్రభావితం అవుతున్నారు..
- బిగ్ బాస్ ప్రోగ్రాం పై పునరాలోచించమని కోరుతోంది " ఫోరమ్ ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "

( స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ )
వినోదం పేరుతో విలువల వికృతి :
రోజువారీ ఒత్తిడికి ఉపశమనంగా బిగ్ బాస్‌ని చూసే వారు లక్షలాదిమంది ఉన్నారు.. అయితే ఇది “మనుషుల మానసిక స్వభావాన్ని తెలుసుకునే ప్రయోగం” అంటారు కొంతమంది.. అయితే అదే సమయంలో, ఇందులోని అసభ్యత, వ్యర్థ ఘర్షణలు, నైతిక పతనం సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని పెద్దలు, విద్యావేత్తలు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.
సీపీఐ నారాయణ ఘాటైన విమర్శలు :
ఇటీవల సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ చేసిన వ్యాఖ్యలు ఎంతో చర్చనీయాంశమయ్యాయి. “బిగ్ బాస్ షోలో అసభ్య ప్రదర్శనలు, ఓపెన్ వ్యభిచారం లాంటి విషయాలు జరుగుతున్నాయి. ఇది యువతను చెడగొడుతోంది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి హోస్ట్ నాగార్జున, మిగతా నిర్వాహకులకు కఠిన శిక్షలు విధించాలి అని ఆయన డిమాండ్ చేశారు.. ఈ షో సాంస్కృతిక విలువలను బలహీనపరుస్తూ, ప్రజాస్వామ్య సమాజంలో అసహనాన్ని పెంచుతోంది అన్నారు..
ఈ షోకి హోస్ట్‌గా ఉన్న నటుడు అక్కినేని నాగార్జునపై కూడా విమర్శల వర్షం కురుస్తోంది. సాంప్రదాయ విలువలతో ప్రసిద్ధి చెందిన నటుడు ఇలా “అసభ్య కంటెంట్‌కి ముఖచిత్రం”గా నిలుస్తున్నారని కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన అభిమానులు మాత్రం “హోస్ట్ మాత్రమే, కంటెంట్‌పై పూర్తి నియంత్రణ ఆయనకు లేదు” అని సమర్థిస్తున్నారు.
అయితే ఈ షో లాభాల వైపు సాగుతోంది.. సాధారణ ప్రజలకు వినోదం లభిస్తోంది.. ఔత్సాహిక నటీ నటులకు, కొత్త నటులకు గుర్తింపు లభిస్తోంది.. టెలివిజన్ రంగానికి టి.ఆర్.పీ. పెరుగుతోంది.. అంతే కాకుండా సాంకేతిక సిబ్బందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి..
కానీ అదే సమయంలో, ఈ లాభాల వెనుక సామాజిక నష్టం పెరుగుతుందనే అభిప్రాయం విస్తృతంగా వినిపిస్తోంది.
ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు :
కంటెంట్ నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు.. రియాలిటీ షోలపై మానిటరింగ్ కమిటీ ఉండాలి. అసభ్య కంటెంట్‌పై జరిమానాలు విధించాలి..
టి.ఆర్.పీ. కోసం సంస్కృతిని నాశనం చేస్తున్న ఛానెల్స్‌పై కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి..
పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి ఎంతుకంటే టెలివిజన్ ప్రభావం ఎలా ఉంటుందో అనే దానిపై యువతలో చైతన్యం కల్పించాలి. నిబంధనల చట్టబద్ధత తీసుకోవాలి.. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ.. ఇలాంటి రియాలిటీ షోలకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలి.
బిగ్ బాస్ షో వినోదం అందిస్తోంది, కానీ అదే సమయంలో విలువల పతనానికి కారణమవుతోందనే అభిప్రాయం పెరుగుతోంది. వాస్తవం ఏమిటంటే సంస్కృతి మన టెలివిజన్‌ని నియంత్రించాలా? లేక టెలివిజన్ మన సంస్కృతిని మార్చేస్తుందా? అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది.. అంతే కాకుండా ప్రజలు, ప్రభుత్వం, మీడియా ఈ ముగ్గురూ కలిసి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది అంటున్నారు మేధావులు..
