నియోపోలిస్‌లో ‘రేవంత్’ మనుషుల గుట్టల దోపిడీ!
- కౌరవ సభలో పాండవుల్లా నిజనిర్ధారణకు వెళ్తే.. అడ్డుకుంటరా?
- సీఎం మేనల్లుడి అనుచరులదే ‘భాగ్యలక్ష్మి’ కబ్జా: దాసోజు శ్రవణ్.
- జీవో 111 ఏమైంది? పీసీబీ అనుమతులేవీ? అధికారుల తీరుపై నిప్పులు
హైదరాబాద్:
"ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చుట్టుముట్టేది పేదల ఇండ్లను కాదు.. తన మేనల్లుడి బినామీలు మింగేస్తున్న గట్టులను చూడాలి" అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. కోకాపేట నియోపోలిస్ ఏరియాలో ‘భాగ్యలక్ష్మి మినరల్స్’ పేరుతో సాగుతున్న అక్రమ మైనింగ్ బాగోతాన్ని ఆయన బుధవారం బట్టబయలు చేశారు. బీఆర్ఎస్ నిజనిర్ధారణ కమిటీతో కలిసి అక్కడ పర్యటించిన శ్రవణ్, ఒక్క పర్మిషన్ లేకున్నా కొండలను పిండి చేస్తున్న తీరును చూసి షాక్ అయ్యారు.
గుట్టలను మింగుతున్న గద్దలు!
పరిశీలన అనంతరం శ్రవణ్ మాట్లాడుతూ.. "మానస హిల్స్‌లో పొంగులేటి బినామీల ‘రాఘవ కన్స్ట్రక్షన్స్’ అగడతాలు చూసి కేజీఎఫ్ సినిమా అనుకున్నం. కానీ ఇక్కడికి వస్తే అది జస్ట్ ట్రైలర్ అని అర్థమైంది. ఇక్కడ నడుస్తున్న భాగ్యలక్ష్మి మినరల్స్ యూనిట్ సీఎం మేనల్లుడు రమేష్ రెడ్డి అనుచరులదే. పైనుంచి కింద దాకా అంతా ఆయన కనుసన్నల్లోనే నడుస్తోంది. మూడు భారీ క్రషర్లు పెట్టి రాత్రింబవళ్లు కొండలను మాయం చేస్తున్నారు. నెలకు రూ. 4 కోట్లు ఈ బినామీల జేబుల్లోకి పోతున్నయ్" అని మండిపడ్డారు..jpeg)
"సామాన్యుడు గూడు కట్టుకుంటే జులుం చేసే అధికారులు, ఇక్కడ 17 ఎకరాల భూమిని నామినేషన్ కింద కట్టబెడితే ఎందుకు నోరు మెదపడం లేదు?" అని శ్రవణ్ నిలదీశారు. జీవో 111 పరిధిలో ఇంత భారీ స్థాయిలో క్రషింగ్ జరుగుతున్నా.. పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి (PCB), మైనింగ్ అధికారులు నిద్రపోతున్నారా అని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రకృతి సంపదను ఏటీఎంలా వాడుకుంటూ ఢిల్లీకి కప్పం కడుతున్నారని ఘాటుగా విమర్శించారు.
ఢిల్లీకి పైసలు.. గల్లీలో దోపిడీ
ముఖ్యమంత్రి ఒక ‘ఫత్వా’ జారీ చేశారని, చుట్టుపక్కల ఉండే కన్స్ట్రక్షన్ కంపెనీలన్నీ కచ్చితంగా ఈ భాగ్యలక్ష్మి యూనిట్ నుంచే కంకర కొనాలని హుకుం జారీ చేయడం దారుణమన్నారు. అధికారులంతా పాలక పక్షంతో కుమ్మక్కై పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నారని శ్రవణ్ ఆరోపించారు.
ఈ అక్రమ మైనింగ్ మీద సర్కార్ ఇప్పటికైనా నోరు విప్పాలని, లేకపోతే సహజ వనరుల దోపిడీపై తాము హైకోర్టును ఆశ్రయిస్తామని శ్రవణ్ హెచ్చరించారు. అవసరమైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)లో కేసు వేసి, ఈ పర్యావరణ హంతకులను బోనులో నిలబెడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, క్రిషాంక్, కార్తీక్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.

