రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- నేడు విద్యాసంస్థలకు సెలవు : జిల్లా కలెక్టర్

ములుగు జిల్లా :
నీటిపారుదల శాఖ అధికారులు వారి వారి పరిధిలోని చెరువులను నిత్యం పర్యవేక్షిస్తూ ఏదైనా అత్యవసర మరమ్మతులు ఉన్నచో యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలన్నారు.
భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా అధికారులు కార్యస్థానంలో ఉంటూ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు.
వర్షాల దృష్ట్యా తక్షణ సహాయం కొరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెంబర్ 18004257109 కు కంట్రోల్ రూమ్‌లో 24 గంటలు అధికారులు, సిబ్బంది షిఫ్టుల వారిగా అందుబాటులో ఉంటూ, వర్షానికి, జలమాయమైయ్యే ప్రాంతాల సమస్య కు సంబంధించిన ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత శాఖల అధికారులను తక్షణ పరిష్కార నిమిత్తం పంపడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
ప్రజలు కూడా ఎవరికి వారు అప్రమత్తంగా ఉంటూ, తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. లోతట్టు ప్రాంతాలు, నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. ఆయా శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేస్తూ, జిల్లాలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తతతో వ్యవహరించాలని అన్నారు. విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. లో లెవెల్ వంతెనలు, కాజ్ వేల మీదుగా వరద ప్రవాహం ఉన్న సమయాలలో రాకపోకలను నిషేధించాలని, చెరువులు, కాలువలు, నదులలో చేపల వేట, ఈత కోసం ఎవరూ వెళ్ళకుండా కట్టడి చేయాలన్నారు. వర్షాల వల్ల చెరువులు, కాలువ కట్టలు తెగి పోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అన్నారు. పురాతన, శిథిలావస్థకు చేరిన భవనాలలో ఉంటున్న వారిని వెంటనే ఖాళీ చేయించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలన్నారు. పునరావాస కేంద్రాలను ముందుగానే గుర్తిస్తూ, అవసరమైన సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను అక్కడికి తరలించి ఆహారం, ఇతర సదుపాయాలు సమకూర్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. వర్షాలతో వరద జలాలు ఏర్పడి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఏమైనా అత్యవసర పరిస్థితులు ఉంటే తక్షణమే తన తీసుకురావాలన్నారు.
మోంథా తుఫాను కారణంగా జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు నేడు గురువారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. బుదవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అన్ని మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు ఈ అత్యవసర సమాచారాన్ని తమ పరిధిలోని పాఠశాలలకు, విద్యార్థులకు తెలియజేసి తగిన చర్యలు తీసుకోగలరని కలెక్టర్ తెలిపారు.
