కాంగ్రెస్ పార్టీతో దోస్తీ...బీజేపీ కార్యకర్తలతో కుస్తీ...

  • అకారణంగా నన్ను కొట్టిన కొప్పులపై చర్యలు తీసుకోవాలి..
  • ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోని పార్టీ అగ్ర నేతలు...
  • బీజేపీ సీనియర్ నాయకులు గుమ్మకొండ ముత్యం రెడ్డి ఆవేదన 

కాంగ్రెస్ పార్టీతో దోస్తీ...బీజేపీ కార్యకర్తలతో కుస్తీ...

ఎల్బీనగర్:

ఎన్నో ఏండ్లుగా విద్యార్థి దశ నుండి పార్టీ కోసం పని చేస్తూ బీజేపీ క్రియాశీలక సభ్యుడిగా ఉన్న తనపై పార్టీలు మారుతూ బీజేపీ పార్టీలోకి వచ్చిన మన్సురాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి దాడి చేయడం హేయమైన చర్య అని, కండ్ల ముందే దాడి చేసినా ఇప్పటి వరకు పార్టీ అగ్ర నేతలు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బిజేపి సీనియర్ నాయకుడు గుమ్మకొండ ముత్యంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.శ్రీ సాయినాథ్ కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కొప్పుల నర్సింహారెడ్డి చర్యపై ఆవేదనతో కన్నీటి పర్యంతం అయ్యారు. తన జీవితం మొత్తం పార్టీ కోసం పని చేశానని, సంఘ్ పరివార్, ఏబీవీపీ, బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేశానని తెలిపారు. ఎల్బీనగర్ చౌరస్తాలో మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్ పేయ్ విగ్రహా ఏర్పాటు కోసం శ్రీకారం చుట్టినప్పటి నుండి నాపై కక్ష సాధింపు కుట్రలు పన్నుతున్నాడని ఆరోపించాడు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం కోసం సహారా రోడ్డు టంగ్రిల్ల అపార్ట్మెంట్ వద్ద బిజెపి జెండాను ఎగురవేసేందుకు కట్టిన దిమ్మెను మాజీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి కూల్చి వేయించాడని తెలిపారు. ఇందిరా నగర్ బస్తీ చౌరస్తాలో ఈనెల ఆరవ తేదీ బీజేపీ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో రంగారెడ్డి అర్బన్ జిల్లా మాజీ అధ్యక్షుడు నియోజకవర్గ ఇన్చార్థి సామ రంగారెడ్డి, సీనియర్ నాయకుడు ఎల్బీనగర్ నియోజకవర్గం బిజెపీ కన్వీనర్ కొత్త రవీందర్ గౌడ్, బీజేపీ కార్యకర్తలు చూస్తుండగా కొప్పుల నరసింహారెడ్డి దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని వాపోయాడు. స్వార్ధపూరితంగా సొంత ప్రయోజనాల కోసం పూటకో పార్టీ మారే కొప్పుల నరసింహారెడ్డి తీరుపై పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు. దాడిపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని, పోలీసులు ఆలస్యంగా ఈ నెల 3న కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. కేసు నమోదు కాకుండా ఉండేందుకు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి. టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్, ఎల్బీనగర్ నియోజకవర్గం ఇన్చార్జి మధు యాష్కీ గౌడ్, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డిలతో పైరవీలు చేయించినట్లు తెలిసిందని ఆరోపించారు. బీజేపీ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ కు అధికార కాంగ్రెస్ పార్టీ పెద్దలతో ఆయనకున్న సత్సబంధాలు చూస్తుంటే ఆయన ఏ పార్టీలో ఉన్నాడన్నది ఆలోచించాల్సి వస్తుందన్నారు. పార్టీ పెద్దలు పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు అమంచ శ్రీనివాస్ పాల్గొన్నారు.

About The Author