నగరంలో ఈ-వేస్ట్ విముక్తికి జిహెచ్ఎంసి ‘మెగా’ అడుగు

​రెండు రోజుల్లో 15 టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ

నగరంలో ఈ-వేస్ట్ విముక్తికి జిహెచ్ఎంసి ‘మెగా’ అడుగు

హైదరాబాద్:

నగరంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల (ఈ-వేస్ట్) నిర్వహణపై పౌరుల్లో అవగాహన పెరుగుతోంది. జీహెచ్‌ఎంసీ చేపట్టిన ప్రత్యేక సేకరణ డ్రైవ్‌కు నగరవాసుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా మార్చి 14, 15 తేదీల్లో నిర్వహించిన ఈ మెగా కలెక్షన్ డ్రైవ్‌లో నగరవ్యాప్తంగా సుమారు 15 టన్నుల (15,000 కిలోలు) వ్యర్థాలను అధికారులు సేకరించారు. 30 సర్కిళ్లలోని 110 కేంద్రాల్లో పౌరులు తమ ఇళ్లలోని పాత మొబైళ్లు, ల్యాప్‌టాప్‌లు, ఛార్జర్లు, కీబోర్డులు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అప్పగించారు.
​పార్కుల్లో ప్రత్యేక కేంద్రాలు
​నగరంలోని ప్రధాన పార్కుల వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాల్లో వ్యర్థాల సేకరణ అధికంగా నమోదైంది.
​జలగం వెంగళరావు పార్క్: ఇక్కడ 450 కిలోల ఈ-వేస్ట్ సేకరించగా, వ్యర్థాలను అందజేసిన వారికి 4,500 రివార్డ్ పాయింట్లు కేటాయించారు.
​ఇందిరా పార్క్: కవాడిగూడ సర్కిల్ పరిధిలోని ఇక్కడ 510 కిలోల వ్యర్థాలు అందాయి. వీరికి రూ. 20,874 నగదు ప్రోత్సాహకంగా అందించారు.

నగదు, రివార్డ్ పాయింట్ల ప్రోత్సాహం
​వ్యర్థాలను శాస్త్రీయంగా రీసైక్లింగ్ చేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారిక రీసైక్లింగ్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. వ్యర్థాల బరువు మరియు రకాన్ని బట్టి అక్కడికక్కడే నగదు లేదా రివార్డ్ పాయింట్లను అందించడం పౌరులను ఆకర్షించింది. డ్రైవ్‌కు ముందు స్వచ్ఛ ఆటో టిప్పర్ల ద్వారా ఇంటింటికీ అవగాహన కల్పించడం వల్లే ఈ స్థాయిలో స్పందన లభించిందని అధికారులు వెల్లడించారు.
​వచ్చే నెలల్లోనూ సేకరణ
​ఈ డ్రైవ్‌ విజయవంతం కావడంతో తదుపరి విడతలను కూడా జీహెచ్‌ఎంసీ ఖరారు చేసింది.
​ఏప్రిల్: 11, 12 తేదీల్లో
​మే: 9, 10 తేదీల్లో
ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
​ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సాధారణ చెత్తలో కలపకుండా, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం నిర్వహించే ఇలాంటి సేకరణ కేంద్రాలకే అప్పగించాలని అధికారులు పౌరులను కోరుతున్నారు.

About The Author