ప్రీతికరమైన రోజున అన్నదానం చేయడమంటే జన్మధన్యమే.!

మణుగూరు :
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన భూతనాధుడుకి ప్రీతికరమైన రోజు అన్నదానం చేయడమంటే జన్మధన్యమేనని అయ్యప్ప మాల ధరించిన కన్నె స్వామి పీక నాగరాజు అన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని శివాలయం పీఠం గురుస్వామి యాకయ్య ఆధ్వర్యంలో గాంధీబొమ్మ సెంటర్, గణేష్ బజార్ లో గల తన నివాసంలో నిత్యపూజలో భాగంగా మధ్యాహ్నం ఆరాధన నిర్వహించారు. అనంతరం అయ్యప్పస్వామి మాలలు ధరించిన దీక్ష పరులకు అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముందుగా అయ్యప్ప స్వామి సోదరులైన గణపతి, సుబ్రమణ్యస్వామి ఇమిడి ఉన్న చిత్రాలకు ప్రాణ ప్రతిష్టి చేశారు. గౌరమ్మను చేసి పూజ చేశారు. అయ్యప్ప సోదరులైన అగ్రజా గణాధిపతి గణపయ్యకు, సుబ్రహ్మణ్యం స్వామికి అష్టోత్తర నామాలతో పూజలు, అదిశంకర చార్యుల పంచారత్నాలు చదివి మంగళహరుతులు ఇచ్చి మాలలు దరించిన స్వాములకు హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా గురుస్వామి యాకయ్య మాట్లాడుతూ ఎంతో కఠినంగా నియమ నిష్ఠలతో మండలదీక్షకు పూనుకొన్న మాలలు దరించిన స్వాములకు ఏయే ధర్మాలని పాటించాలో, ఏ నియమనిష్ఠలతో వుండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను గురుస్వామి కొత్తగా మాలధరించిన కన్నె స్వాములకు సూచించారు. అందరినీ భగవంతుని స్వరూపాలుగా భావించాలని తెలిపారు. అయ్యప్ప శరణు ఘోషను నిత్యం కంఠస్తాం చేస్తూ, నిత్యం భజన కార్యక్రమంలో పాల్గొనాలని యాకయ్య గురుస్వామి సూచనలు చేశారు. భూతనాధుడైన అయ్యప్ప స్వాములకు అన్నదానం చేస్తే మనస్సుకు వచ్చే ప్రశాంతత అభివర్ణించలేమని కన్నె స్వామి నాగరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు ఎన్ నాగేశ్వరరావు, బోడ బాలు, మోర్ శ్రీను, సదానందం, కన్నె, కత్తి, గంట, గద, పెరు స్వాములు, మాల ధరించని స్వాములు పాల్గొన్నారు.
