పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మల్‌రెడ్డి రాంరెడ్డి..
బాధితుడికి రూ. 60 వేల సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత.
చైతన్యపురి:
రాష్ట్రంలోని పేద ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం హిల్స్ కాలనీకి చెందిన బొమ్మ శివకుమార్‌కు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుంచి మంజూరైన రూ. 60,000 చెక్కును గురువారం ఆయన చైతన్యపురిలోని కాంగ్రెస్ కార్యాలయంలో అందజేశారు.
అర్హులందరికీ ప్రభుత్వ భరోసా
ఈ సందర్భంగా మల్‌రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ పథకాలు వేగంగా ప్రజల్లోకి వెళ్తున్నాయని పేర్కొన్నారు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతూ చికిత్స తీసుకోలేని స్థితిలో ఉన్న నిరుపేదలకు సీఎం సహాయనిధి ఒక వరంలా మారిందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సాయాన్ని పొందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమ కుటుంబాన్ని ఆదుకున్నందుకు శివకుమార్ హర్షం వ్యక్తం చేశారు. సాయం మంజూరు చేయించిన మల్‌రెడ్డి రాంరెడ్డికి, ముఖ్యమంత్రికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ భాస్కరా చారి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పన్యాల జైపాల్ రెడ్డి, మెగావత్ గణేష్ నాయక్, కాంగ్రెస్ నాయకులు బబ్బూరి ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
