బీజేపీ ధర్నాలో ప్రభుత్వ ఉపాధ్యాయుల ‘ప్రసంగ’ హోరు!
ప్రభుత్వ జీతం పార్టీకి సేవ, బడుగు వర్గాల పిల్లల చదువులు నిర్లక్ష్యం
- నిబంధనలకు తిలోదకాలిచ్చి రాజకీయ వేదికపైకి..
- చర్చనీయాంశంగా ‘తపస్’ నేతల తీరు; చర్యలకు రంగం సిద్ధం?
- సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్స్ ఉల్లంఘనపై విద్యాశాఖకు ఫిర్యాదు చేసిన , కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ, రాజ్యాంగ పరిరక్షణ వేదిక,
రాజ్యాంగం కల్పించిన హోదాను రాజకీయాలకు తాకట్టు పెట్టడం అంటే, అక్షరాలను అంగట్లో అమ్మకానికి పెట్టడమే. బడి గంట మోగాల్సిన వేళ, పార్టీ జెండా పట్టుకుని పరవశించిపోవడం ఉపాధ్యాయ వృత్తికే మాయని మచ్చ. చట్టం ఏం చెబుతుందో తెలియని అజ్ఞానులు కారు వీరు; తెలిసి కూడా 'కండక్ట్ రూల్స్'ను కాలరాస్తున్న చదువుల సార్లు. వీరు పాఠాలు చెప్పేది పేద బిడ్డలకా? లేక పార్టీ సిద్ధాంతాలకా?
హైదరాబాద్:
ప్రభుత్వ నిబంధనలు గాలికి ఎగిరిపోయాయి.. రాజకీయ తటస్థత పాతాళానికి పడిపోయింది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ రాజకీయ పార్టీ వేదికపై గొంతు చించుకోవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జనవరి 26న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ సాక్షిగా జరిగిన ఓ రాజకీయ ధర్నా, ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రవర్తనా నియమావళి (Conduct Rules) పై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది.
పెండింగ్ బిల్లుల సాధన కోసం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో.. తపస్ (TAPAS) రాష్ట్ర అధ్యక్షుడు వొదనాల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి తెలకలపల్లి పెంటయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ కానుగంటి హనుమంతరావు తదితరులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. కేవలం హాజరు కావడమే కాకుండా, సదరు రాజకీయ పార్టీ నాయకులతో కలిసి వేదికను పంచుకోవడమే కాకుండా, మైక్ పట్టుకుని ప్రసంగించడం ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువైంది.
రూల్ 5 ఏం చెబుతోంది?
ముఖ్యంగా బహిరంగ వేదికలపై రాజకీయ అనుబంధాన్ని ప్రదర్శించడం తీవ్రమైన అపరాధంగా పరిగణించబడుతుంది. 1991 CCA నిబంధనల ప్రకారం ఇది స్పష్టమైన ‘అనుచిత ప్రవర్తన’ (Misconduct) కిందకు వస్తుంది.
సీఎస్, విద్యాశాఖకు ఫిర్యాదులు:
ప్రభుత్వ జీతం తీసుకుంటూ, ఒక పార్టీకి వత్తాసు పలకడంపై ఇతర ఉపాధ్యాయ సంఘాలు, సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS), విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు అధికారికంగా ఫిర్యాదులు అందాయి.
ప్రధాన డిమాండ్లు:
నిబంధనలు ఉల్లంఘించిన నేతలపై తక్షణమే శాఖాపరమైన విచారణ చేపట్టాలి.
బాధ్యులను తక్షణమే సస్పెండ్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలి.
వ్యవస్థలో రాజకీయ జోక్యాన్ని నియంత్రించి, పరిపాలనా విలువలను కాపాడాలి.
మౌనం వహిస్తే ముప్పే 100 పైగా సంఘాలు ఏర్పాటు చేసుకొని పేద బడుగు బలహీన వర్గాల పిల్లల చదువును నిర్లక్ష్యం చేసున్న ఉపాధ్యాయ సంఘాల నేతలను రాజకీయాలకు దూరంగా ఉంచాలి అప్పుడే ప్రభుత్వ విద్య బతికి బట్ట కడుతుంది,
ప్రభుత్వ ఉద్యోగులు ఇలా బహిరంగంగా రాజకీయ బావుటా పట్టుకుంటే, భవిష్యత్తులో పరిపాలనా యంత్రాంగం నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో, విద్యాశాఖ ఎలాంటి కొరడా ఝుళిపిస్తుందో వేచి చూడాలి.
