ఆక్రమణల చెర నుంచి పార్కులకు హైడ్రా అవియుక్తి

  • ఒకే కాలనీలో ఆరు పార్కుల రక్షణ.. 3,712 గజాల స్వాధీనం
  • ​విముక్తి పొందిన భూమి విలువ రూ. 37.12 కోట్లు
  • ​హర్షం వ్యక్తం చేస్తూ కాలనీల్లో స్థానికుల సంబరాలు

ఆక్రమణల చెర నుంచి పార్కులకు హైడ్రా అవియుక్తి

హైదరాబాద్
నగరంలో ప్రాణవాయువును అందించే ఊపిరితిత్తుల వంటి పార్కులపై కబ్జాదారుల కన్ను పడితే 'హైడ్రా' (HYDRAA) సహించే ప్రసక్తే లేదని మరోసారి నిరూపితమైంది. ప్రజావాణిలో అందిన ఫిర్యాదులపై మెరుపు వేగంతో స్పందించిన అధికారులు.. శుక్రవారం ఒకేరోజు వేర్వేరు ప్రాంతాల్లో ఏకంగా 3,712 గజాల పార్కు స్థలాలకు విముక్తి కల్పించారు. వీటి బహిరంగ మార్కెట్ విలువ సుమారు రూ. 37.12 కోట్లు ఉంటుందని అంచనా. కబ్జాల చెర వీడటంతో స్థానిక నివాసితులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు.

​భాగ్యలక్ష్మి కాలనీలో ‘ఆరు’ పార్కుల రక్షణ

​మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం సుభాష్‌ నగర్ పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీలో 1968లో 80 ఎకరాల్లో లేఅవుట్ వేశారు. ఇందులో 10 పార్కులను కేటాయించారు. 

అయితే, అప్పట్లో ఈ లేఅవుట్ మీదుగా వెళ్లే హైటెన్షన్ విద్యుత్ లైన్ల కారణంగా కొన్ని పార్కులు ఆ లైన్ల కిందకు వచ్చాయి. సుమారు 20 ఏళ్ల క్రితం ఆ విద్యుత్ లైన్లను తొలగించడంతో, ఖాళీగా ఉన్న పార్కు స్థలాలపై ఆక్రమణదారుల కన్ను పడింది. స్థానిక అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానికులు హైడ్రాను ఆశ్రయించారు.

​హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన అధికారులు.. వరుసగా ఉన్న 6 పార్కులను గుర్తించారు. శుక్రవారం అక్కడ అక్రమ నిర్మాణాలను తొలగించి, 2,260 గజాల స్థలానికి ఫెన్సింగ్ వేసి తమ బోర్డులను ఏర్పాటు చేశారు.

​గుడిమల్కాపూర్‌లో 1,452 గజాల స్వాధీనం

​అసిఫ్ నగర్ మండలం గుడిమల్కాపూర్ గ్రామంలోని ఏజీ ఆఫీస్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్‌లో 1,500 గజాల పార్కు స్థలం ఏళ్ల తరబడి కబ్జాదారుల చేతుల్లో బందీ అయింది. 

ఒకప్పుడు గుంతగా ఉన్న ఈ స్థలాన్ని పూడ్చివేసిన కొందరు వ్యక్తులు.. అక్కడ ఇసుక వ్యాపారం, వాహనాల పార్కింగ్, కొబ్బరిబొండాల విక్రయాలు సాగిస్తున్నారు. 2018 నుంచి స్థానికులు పోరాటం చేస్తున్నా ఫలితం లేకపోయింది. హైడ్రా రంగంలోకి దిగి రికార్డులను పరిశీలించగా అది పార్కు స్థలమేనని తేలింది. దీంతో శుక్రవారం అక్కడ 1,452 గజాల స్థలానికి విముక్తి కల్పించి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.

​హైడ్రాకు జేజేలు.. కాలనీల్లో పండగ వాతావరణం

​దశాబ్దాల నాటి సమస్యలు ఒక్క రోజులో పరిష్కారం కావడంతో స్థానిక కాలనీల్లో పండగ వాతావరణం నెలకొంది. కబ్జాల తొలగింపు అనంతరం స్థానికులు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. హైడ్రా ఏర్పాటు చేసిన బోర్డుల వద్ద సెల్ఫీలు దిగుతూ, ప్రభుత్వానికి మరియు అధికారులకు అనుకూలంగా నినాదాలు చేశారు.

About The Author