పాటిఘనాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్
47,840 గజాల పార్కులు, రహదారి స్థలాల స్వాధీనం
పటాన్‌చెరు:
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాటిఘనాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. 92 ఎకరాల పరిధిలోని లేఅవుట్‌లో అన్యాక్రాంతమైన పార్కులు, రహదారులు, ప్రజావసరాల స్థలాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఫిర్యాదు అందిన మూడు రోజుల్లోనే..
సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అందిన ఫిర్యాదుపై హైడ్రా వేగంగా స్పందించింది. బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన అధికారులు, గురువారం ఉదయాన్నే ఆక్రమణల తొలగింపు చేపట్టారు.
పాటిఘనాపూర్‌లో 1980లో 92 ఎకరాల విస్తీర్ణంలో 1109 ప్లాట్లతో ‘ఆనందనగర్ కాలనీ’ పేరుతో లేఅవుట్ వెలిసింది.
తర్వాతి కాలంలో ఈ స్థలాన్ని వ్యవసాయ భూమిగా చిత్రించి, నకిలీ పాస్‌బుక్కులు సృష్టించి ఇతరులకు విక్రయించినట్లు ఫిర్యాదులు అందాయి.
విచారణ చేపట్టిన అధికారులు లేఅవుట్ నిబంధనలను ఉల్లంఘించి పార్కులు, రహదారులను కబ్జా చేసినట్లు గుర్తించారు.
ప్రీకాస్ట్ బ్రిక్స్‌తో నిర్మించిన ప్రహరీ గోడలు, అక్రమ షెడ్డులను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. మొత్తం 47,840 గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ఇవి ‘పార్కు స్థలాలు’ అని తెలుపుతూ హైడ్రా బోర్డులను ఏర్పాటు చేశారు. రహదారి స్థలాలను గుర్తించి హద్దులు నిర్ణయించడంతో పాటు, పార్కు స్థలాల చుట్టూ ఫెన్సింగ్ వేశారు.

About The Author
27 Mar 2026
