ప్రజాప్రయోజనమే పరమావధిగా పనిచేయాలి: హైడ్రా రంగనాథ్..!
- విధి నిర్వహణలో ప్రత్యేకత చాటుకోవాలి: గ్రూప్-1 అధికారులకు హైడ్రా కమిషనర్ దిశానిర్దేశం
హైదరాబాద్
కష్టపడి చదువుకుని గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు తమ విధి నిర్వహణలో ప్రత్యేకతను చాటుకోవాలని, ప్రజాప్రయోజనమే లక్ష్యంగా పనిచేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు. శుక్రవారం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD)లో శిక్షణ పొందుతున్న గ్రూప్-1 అధికారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అధికారులపై ప్రజలకు నమ్మకం కలిగేలా పారదర్శకమైన చర్యలు ఉండాలని, అప్పుడే పరిపాలన సులభతరమవుతుందని పేర్కొన్నారు.
ఆక్రమణల తొలగింపుతో పెరిగిన విశ్వసనీయత:
"చెరువుల పునరుద్ధరణ - వరద ముప్పు నివారణ"
నగరంలో ఇప్పటికే మూడు చెరువులను పునరుద్ధరించామని, మరో 22 చెరువులను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ వివరించారు. కాలువల్లో పూడికను భారీస్థాయిలో తొలగించడం వల్ల గత వర్షాకాలంలో నగరంలో వరద ముప్పు, నీటి మునక సమస్యలు తలెత్తకుండా చూడగలిగామని పేర్కొన్నారు. తొలుత విమర్శించిన వారే ఇప్పుడు ఈ చర్యలను అభినందిస్తున్నారని గుర్తుచేశారు.
ప్రజావాణి ప్రాముఖ్యత: ప్రజల సాధకబాధకాలను తెలుసుకోవడానికి 'ప్రజావాణి' వేదిక ఎంతో ఉపయోగపడుతుందని, సమస్యలను పరిష్కరించుకుంటూ పోతే విధి నిర్వహణ సులభమవుతుందని హితవు పలికారు.
అంకితభావం: ఏ బాధ్యత అప్పగించినా నిబద్ధతతో పనిచేయడమే తన విధానమని, అది మనసిక తృప్తినిస్తుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
అభ్యర్థుల స్పందన: హైడ్రా పనితీరు తమకు మార్గదర్శకంగా ఉంటుందని, ఆ సంస్థ కార్యకలాపాలను తాము నిశితంగా గమనిస్తున్నామని కొత్తగా ఎంపికైన అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.
