గంధంగూడలో రూ. 600 కోట్ల ప్రభుత్వ భూమిని రక్షించిన హైడ్రా
ఐటీ కారిడార్ సమీపంలో 6.30 ఎకరాల స్వాధీనం.. హైడ్రా ఆధ్వర్యంలో ఫెన్సింగ్
హైదరాబాద్:
ఐటీ కారిడార్‌కు ఆనుకుని ఉన్న గంధంగూడలో రూ. 600 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా (HYDRAA) కాపాడింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం గంధంగూడ సర్వే నంబరు 86/పి లోని 6.30 ఎకరాల స్థలాన్ని గతంలో ప్రభుత్వం జలమండలికి కేటాయించింది. మురుగునీటి శుద్ధి కేంద్రం (STP) నిర్మాణానికి ఉద్దేశించిన ఈ భూమిని కొందరు ఆక్రమించి షెడ్లు నిర్మించారు.
జలమండలి విజ్ఞప్తితో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు.. మున్సిపల్, రెవెన్యూ విభాగాలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ఆక్రమణలను గుర్తించి షెడ్లను తొలగించారు. అనంతరం 6.30 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి, అది ప్రభుత్వ భూమి అని తెలిపే బోర్డులను ఏర్పాటు చేశారు.
చెరువులు, శ్మశాన వాటికల కబ్జాపై 'హైడ్రా'కు ఫిర్యాదుల వెల్లువ
హైదరాబాద్: చెరువుల ఎఫ్‌టీఎల్ (FTL) పరిధిలో అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ భూముల కబ్జాలపై హైడ్రా కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి భారీగా ఫిర్యాదులు అందాయి. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 42 ఫిర్యాదులు రాగా, అధికారులు వాటిని పరిశీలించారు.
ప్రగతినగర్: ఇక్కడ 5 ఎకరాల శ్మశాన వాటిక స్థలంతో పాటు, డంపింగ్ యార్డుకు కేటాయించిన 4 ఎకరాల భూమి కబ్జాకు గురవుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. సర్వే అధికారులు ధ్రువీకరించినా ఆక్రమణలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
బాచుపల్లి: బాచుపల్లి పెద్దకుంట చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నా లెక్కచేయకుండా శ్మశాన వాటిక నిర్మిస్తున్నారని శిఖర రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది.
మదీనాగూడ: శేరిలింగంపల్లి మండలం మదీనాగూడలోని పోచమ్మ దేవాలయ భూమిలో అపార్ట్‌మెంట్ నిర్మిస్తున్నారని, కోర్టు స్టే ఉన్నా పనులు ఆపడం లేదని గ్రామస్థులు ఆరోపించారు.
అమీన్‌పూర్ పోచమ్మకుంట ఎఫ్‌టీఎల్ పరిధిలోనూ ఇదే తరహా ఆక్రమణలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందాయి.
బోడుప్పల్: ఎస్‌బీఆర్ కాలనీలో 25 అడుగుల రహదారిని ఆక్రమించి దుకాణాలు నిర్మించారని, దీనివల్ల అంబులెన్స్‌లు, పాఠశాల బస్సులు వెళ్లడానికి వీల్లేకుండా పోయిందని కాలనీ వాసులు వాపోయారు.
ఈ ఫిర్యాదులను హైడ్రా అదనపు సంచాలకులు పాపయ్య పరిశీలించి, తక్షణ పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
