ధాన్యం అక్రమ రవాణాపై నిఘా: ఆలగడప వద్ద తనిఖీలు
మిర్యాలగూడ:
అంతర్రాష్ట్ర సరిహద్దుల గుండా ధాన్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు నిఘా ముమ్మరం చేశారు. శుక్రవారం ఉదయం నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని ఆలగడప చెక్ పోస్ట్ వద్ద పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ మాచన రఘునందన్ ఆధ్వర్యంలో పోలీసులతో కలిసి ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
ప్రస్తుతం ధాన్యం సేకరణ ప్రక్రియ ప్రారంభం కావడంతో పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి ధాన్యం తెలంగాణలోకి రాకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా సరిహద్దు దాటి వస్తున్న లారీలను ఆపి, ధాన్యం ఎక్కడి నుంచి వస్తోంది? ఏ మిల్లుకు వెళ్తోంది? రైతు వివరాలు ఏమిటి? అనే అంశాలపై ఆరా తీశారు. సంబంధిత ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
