కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ
- రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న ఎర్రవెల్లి సమావేశం
- మీతో కలిసి పనిచేయమని దేవుడే పంపాడు'.. కేసీఆర్‌తో మాజీ మంత్రి భావోద్వేగ వ్యాఖ్యలు
సిద్దిపేట:
ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, సీనియర్ నేత టి. జీవన్ రెడ్డి శుక్రవారం సిద్దిపేట జిల్లా మార్కూక్ మండలం ఎర్రవెల్లిలోని నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ అయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి లోపలికి ఆహ్వానించారు.
*అన్నా.. దేవుడే నన్ను పంపాడు!*
సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో కలిసి పనిచేసిన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, కేసీఆర్‌ను కలిసిన సమయంలో జీవన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. *"అన్నా.. మీతో కలిసి పని చేయమని దేవుడే నన్ను పంపాడు"* అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలపై వీరిద్దరూ సుమారు గంటకు పైగా చర్చించినట్లు సమాచారం.
జీవన్ రెడ్డి రాక సందర్భంగా ఎర్రవెల్లి నివాసంలో సందడి నెలకొంది. ఈ భేటీలో ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.
* *పాల్గొన్న ప్రముఖులు:* మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్. రమణ, కోరుట్ల ఎమ్మెల్యే డా. కె. సంజయ్.
జగిత్యాల నియోజకవర్గంలో దశాబ్దాలుగా పట్టున్న జీవన్ రెడ్డి, మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేతతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. జిల్లాలో పార్టీ పటిష్టతపై ఈ భేటీ ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

