బడ్జెట్‌లో జర్నలిస్టులకు ‘మొండిచేయి’!

  • సంక్షేమాన్ని విస్మరించిన సర్కార్‌పై TWJF ఆగ్రహం
  • ​అక్రెడిటేషన్లు లేవు.. హెల్త్ కార్డుల ముచ్చటే లేదు
  • ​చిన్న పత్రికల బిల్లులు ఆపడం అన్యాయం: మామిడి సోమయ్య

బడ్జెట్‌లో జర్నలిస్టులకు ‘మొండిచేయి’!

​హైదరాబాద్:

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జర్నలిస్టుల సంక్షేమానికి పైసా కేటాయించకుండా మొండిచేయి చూపడంపై తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (TWJF) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సమాజ హితం కోసం పనిచేసే జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపడం తగదని TWJF రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య మండిపడ్డారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్ కేటాయింపుల్లో మీడియా రంగాన్ని పూర్తిగా విస్మరించడంపై ఆవేదన వ్యక్తం చేశారు.

​అడ్రస్ లేని అక్రెడిటేషన్లు.. ఊసేలేని ఇళ్ల స్థలాలు:
​ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లవుతున్నా జర్నలిస్టుల ప్రధాన డిమాండ్లయిన ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డుల ఊసే లేదని సోమయ్య విమర్శించారు. "అన్ని వర్గాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించిన ప్రభుత్వం.. జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలను ఎలా అమలు చేస్తుందో చెప్పాలి. కనీసం కొత్త అక్రెడిటేషన్ కార్డులు కూడా ఇవ్వకపోవడం బాధాకరం" అని ధ్వజమెత్తారు. మీడియా అకాడమీకి బడ్జెట్‌లో ప్రాధాన్యత కల్పించకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోందన్నారు.

​చిన్న పత్రికల గొంతు నొక్కుతున్నారు..
​కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి చిన్న, మధ్యతరహా పత్రికలను విస్మరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
​గతంలో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలి.
​సమాచార, పౌర సంబంధాల శాఖ (I&PR)ను నిర్వీర్యం చేయడం ఆపాలి.
​చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని పెంచాలి.

​పోరాటమే శరణ్యం!
​ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే మీడియాపై పాలకుల నిర్లక్ష్యం తగదని, ఇప్పటికైనా జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని సోమయ్య డిమాండ్ చేశారు. జర్నలిస్టుల డిమాండ్లను పెడచెవిన పెడితే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

About The Author