జర్నలిస్టుల జంగ్.. 25న 'ఛలో హైదరాబాద్'

  • సర్కారు నిర్లక్ష్యంపై నిప్పులు చెరిగిన TWJF
  • ​బడ్జెట్‌లో మొండిచేయి.. హామీలు గాలికి
  • ​ఐ అండ్ పీఆర్ ముట్టడికి సోమయ్య పిలుపు

జర్నలిస్టుల జంగ్.. 25న 'ఛలో హైదరాబాద్'

​హైదరాబాద్:
జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండివైఖరిపై తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) యుద్ధం ప్రకటించింది. "మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు గడప దాటడం లేదు" అన్న చందంగా తయారైన సర్కారు తీరుకు నిరసనగా ఈనెల 25న 'ఛలో హైదరాబాద్ - ఐ అండ్ పీఆర్ కార్యాలయ ముట్టడి' కి పిలుపునిచ్చింది. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కీలక సమావేశంలో ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య మాట్లాడారు.

​రెండేళ్ల పాలన.. అన్నీ నీటిమూటలే!
​కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా, జర్నలిస్టుల సంక్షేమం అటకెక్కిందని సోమయ్య మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. "ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జర్నలిస్టుల ఊసే లేదు. ఇది పాత్రికేయ లోకంపై ప్రభుత్వం చూపిస్తున్న వివక్షకు పరాకాష్ట" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

​సమస్యల సుడిగుండంలో కలం యోధులు:

​ప్రభుత్వం జర్నలిస్టులను ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందులకు గురిచేస్తోందని సోమయ్య దుయ్యబట్టారు. ఆయన లేవనెత్తిన ప్రధానాంశాలు:

​అక్రెడిటేషన్ల అగచాట్లు: రెండేళ్లు దాటినా కొత్త కార్డులు ఇవ్వకపోవడంతో ఫీల్డ్‌లో జర్నలిస్టులు అవమానాలు ఎదుర్కొంటున్నారు.

​హెల్త్ కార్డులు హుష్కాకీ: అనారోగ్యం పాలైతే ఆదుకునే దిక్కులేదు. హెల్త్ కార్డుల జారీలో జాప్యం ప్రాణాల మీదకు తెస్తోంది.

​ఇళ్ల స్థలాల సాకు: సుప్రీంకోర్టు తీర్పును అడ్డం పెట్టుకుని ఇళ్ల స్థలాల కేటాయింపులో ప్రభుత్వం కాలయాపన చేస్తోంది.

​పెన్షన్ల విస్మరణ: పొరుగు రాష్ట్రాల్లో ఇస్తున్నట్లుగా రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్లు ఇచ్చే ఆలోచనే ఈ సర్కారుకు లేదు.

​మీడియా అకాడమీ నిద్ర: అకాడమీకి గవర్నింగ్ కౌన్సిల్‌ను నియమించకుండా నిర్వీర్యం చేస్తున్నారు.

​చిన్న పత్రికల గొంతు నులుముతున్నారు!
​చిన్న, మధ్య తరహా పత్రికలపై ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగుతోందని సోమయ్య ఆరోపించారు. రెండేళ్లుగా అడ్వర్టైజ్‌మెంట్ బిల్లులు చెల్లించకపోవడంతో ఆయా పత్రికల యజమానులు, జర్నలిస్టులు వీధిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. RNI గుర్తింపు ఉన్నా ఎంపానల్‌మెంట్‌ చేయకుండా వివక్ష చూపుతున్నారని విమర్శించారు.

​"జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రసక్తే లేదు. 25న జరిగే ఐ అండ్ పీఆర్ ముట్టడికి రాష్ట్రవ్యాప్తంగా పాత్రికేయులు తరలిరావాలి. మన హక్కులను పోరాడి సాధించుకుందాం."
— మామిడి సోమయ్య, TWJF కన్వీనర్

About The Author