కబ్జాకోరల్లో ‘కాటి’ భూములు..
- ‘హైడ్రా’కు వెల్లువెత్తిన ఫిర్యాదులు ప్రజావాణిలో 32 వినతులు..
- చెరువుల అభివృద్ధిపై నగరవాసుల ఆశలు
- ప్రణీత్ ఆంటిల్యా అడ్డుగోడ తొలగింపు.. మల్లంపేట వాసులకు తీరిన తిప్పలు
హైదరాబాద్:
నగరంలో ఆక్రమణదారుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. సామాన్యుల స్థలాలనే కాదు.. కడతేరిన తర్వాత విశ్రమించే స్మశాన వాటికలనూ వదలడం లేదని ‘హైడ్రా’ ప్రజావాణిలో బాధితులు వాపోయారు. సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 32 ఫిర్యాదులు అందాయి. 
ప్రధానంగా స్మశాన వాటికల కబ్జా, చెరువుల పునరుద్ధరణ, పార్కుల పరిరక్షణపై వినతులు వెల్లువెత్తాయి.
చాలాకాలంగా మల్లంపేట ప్రాంత నివాసితులను వేధిస్తున్న రహదారి సమస్యకు హైడ్రా పరిష్కారం చూపింది. బాచుపల్లి మండలం మల్లంపేటలోని ‘ప్రణీత్ ఆంటిల్యా’ గేటెడ్ కమ్యూనిటీ పేరిట 40 అడుగుల బహిరంగ రహదారికి అడ్డంగా నిర్మించిన ప్రహరీని అధికారులు సోమవారం కూల్చివేశారు. హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం, ఇరుపక్షాలతో చర్చించి.. ఇది నిబంధనల ప్రకారం గేటెడ్ కమ్యూనిటీ కాదని తేల్చిన అనంతరం ఈ చర్యలు చేపట్టారు.
దీంతో గతంలో 8 కిలోమీటర్లు చుట్టూ తిరిగి ప్రయాణించాల్సిన బాధితులకు, ఇప్పుడు కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ప్రగతినగర్ చేరుకునే వీలు కలిగింది. సుమారు 5 కిలోమీటర్ల దూరం తగ్గడంతో లక్ష్మీ శ్రీనివాస్ కాలనీ, గ్రీన్‌పార్కు, సాయినగర్ తదితర కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఇక్కడ యుద్ధప్రతిపాదికన బీటీ రోడ్డు పనులు కూడా ప్రారంభమయ్యాయి.
స్మశానాల కబ్జా: శంషాబాద్‌లోని ఎం.బి. మిషన్ కంపౌండ్‌లో శతాబ్ద కాలంగా ఉన్న క్రైస్తవ స్మశాన వాటిక భూమిని రికార్డులు మార్చి ఆక్రమిస్తున్నారని కమిటీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
చెరువుల అభివృద్ధి: యూసుఫ్‌గూడ కృష్ణాకాంత్ పార్కులోని చెరువును పునరుద్ధరించాలని, గుర్రపుడెక్క తొలగించి భూగర్భ జలాలను పెంచేలా చర్యలు తీసుకోవాలని వాకర్స్ అసోసియేషన్ కోరింది.
పార్కు స్థలాల రక్షణ: శేరిలింగంపల్లి సెంట్రల్ పార్క్ ఫేజ్-1లో పార్కు భూమిని ఆక్రమించేందుకు కొందరు ప్రహరీని ధ్వంసం చేశారని కాలనీవాసులు మొరపెట్టుకున్నారు.
ప్రభుత్వ భూమి ఆక్రమణ: రాజేంద్రనగర్ టీఎన్జీఓస్ కాలనీలోని సుమారు 300 గజాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారని ఫిర్యాదు అందింది.
అందిన ఫిర్యాదులను హైడ్రా అదనపు సంచాలకులు శ్రీ వర్ల పాపయ్య పరిశీలించి, వెంటనే క్షేత్రస్థాయి విచారణ జరిపి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
నగరంలో చెరువులను గొలుసుకట్టు పద్ధతిలో అభివృద్ధి చేసి, వరద ముప్పు లేకుండా చూడాలని పలు సంక్షేమ సంఘాలు విన్నవించాయి..jpeg)

