లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి

​ఎల్బీనగర్‌లో టీయూసీఐ భారీ ర్యాలీ.. దేశవ్యాప్త సమ్మెకు మద్దతు.

లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి

ఎల్బీనగర్:
 
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం టీయూసీఐ ఆధ్వర్యంలో మన్సూరాబాద్ చౌరస్తా నుంచి కామినేని ఆసుపత్రి మీదుగా ఎల్బీనగర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన సభ చేపట్టారు.
​కార్పొరేట్ల కోసమే చట్టాల సవరణ
​ఈ సభకు ఎంఎల్పీఐ (రెడ్ ఫ్లాగ్) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఆర్. సంతోష్ అధ్యక్షత వహించగా, టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి ఎండి కాసిం, ఉపాధ్యక్షుడు ఎం. లింగస్వామి, ఏఐకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాన్యం భూజేందర్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు మేలు చేయడానికే 29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా కుదించిందని వారు విమర్శించారు. దేశ పారిశ్రామిక రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకే ఈ మార్పులు చేస్తున్నారని మండిపడ్డారు.
​ప్రైవేటు కోరల్లో పారిశ్రామిక రంగం
​విద్యుత్, విత్తన సవరణ బిల్లులతో పాటు వీబీజీ రామ్ జీ బిల్లులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికే దేశంలోని పారిశ్రామిక రంగం ప్రైవేటు, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ముసుగులో కార్పొరేట్ల గుప్పెట్లోకి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల హక్కులను కాలరాసే ఏ చట్టాన్ని ఊపేక్షించబోమని హెచ్చరించారు.

​పాల్గొన్న ముఖ్యులు:
ఈ కార్యక్రమంలో జన సాంస్కృతిక కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు పి. యాకన్న, నాయకులు కె. శ్రీను, పి. పరమేష్, విజయ్, పరమేశ్వరి, కళ్యాణి పాల్గొన్నారు. అలాగే ఆటో యూనియన్ నాయకులు ఎన్. మున్నా, దొబ్బల శీను, బాలరాజు, శేఖర్, కొమరయ్య, వ్యాన్ యూనియన్ నాయకులు భిక్షం, డి.ఎస్. పరమేష్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About The Author