అంబేద్కర్ ఆశయ సాధనలో భాగస్వాములవుదాం: జీహెచ్‌ఎంసీ కమిషనర్
ఘనంగా బాబాసాహెబ్ జయంతి వేడుకలు.. పన్ను చెల్లింపుదారులకు 5 శాతం రాయితీ
హైదరాబాద్:
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ పిలుపునిచ్చారు. మంగళవారం అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించేందుకు అంబేద్కర్ చేసిన కృషి అమోఘమని కొనియాడారు. ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలవాలని, పారదర్శకత, సేవా మనోభావంతో అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు కె.సత్యనారాయణ, ఎన్. రవికిరణ్, చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ అబ్దుల్ వకీల్, పీఆర్వో ఖాజా మోజినుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.
*ముందస్తు పన్ను చెల్లింపుపై 5% రాయితీ*
నగరవాసులకు మేలు చేకూర్చేలా జీహెచ్‌ఎంసీ ‘ఎర్లీ బర్డ్’ స్కీమ్‌ను అమల్లోకి తీసుకువచ్చింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించే వారికి 5 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు కమిషనర్ ప్రకటించారు.
* *గడువు:* ఏప్రిల్ 30, 2026 లోపు ప్రస్తుత ఏడాది పన్ను మొత్తం చెల్లించాలి.
నిబంధన: పాత బకాయిలు ఏవైనా ఉంటే వాటిని కూడా పూర్తిగా చెల్లించిన వారికే ఈ రాయితీ వర్తిస్తుంది.
* *చెల్లింపు మార్గాలు:* MyGHMC యాప్, అధికారిక వెబ్‌సైట్, సిటిజన్ సర్వీస్ సెంటర్లు లేదా మీ-సేవా కేంద్రాల ద్వారా పన్ను చెల్లించవచ్చు.
నగర అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి పౌరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు..jpeg)
