ఆక్రమణదారుల చెర నుంచి.. పార్కుకు విముక్తి!

​గోపాల్‌నగర్‌లో 3300 గజాల స్థలం స్వాధీనం:కంచె వేసి, బోర్డులు నాటిన హైడ్రా..

ఆక్రమణదారుల చెర నుంచి.. పార్కుకు విముక్తి!

కూకట్‌పల్లి: 

చెరువులు, ప్రభుత్వ భూములే కాకుండా.. కాలనీల్లోని ఉమ్మడి ఖాళీ స్థలాలు, పార్కులపై కన్నేసిన ఆక్రమణదారుల ఆటకట్టించే పనిలో 'హైడ్రా' వేగం పెంచింది. తాజాగా మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి మండల పరిధిలోని గోపాల్‌నగర్‌లో కబ్జాకు గురవుతున్న సుమారు 3300 గజాల పార్కు స్థలాన్ని అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమణలను తొలగించి స్థలం చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు.
​ప్రజావాణి ఫిర్యాదుతో కదలిక
​గోపాల్‌నగర్‌ లేఅవుట్‌ను 1980లో సుమారు 92.21 ఎకరాల విస్తీర్ణంలో (సర్వే నంబర్లు 148 నుంచి 155 వరకు) 1200 ప్లాట్లతో రూపొందించారు. నిబంధనల ప్రకారం అప్పట్లో మూడు చోట్ల పార్కుల కోసం స్థలాలను కేటాయించారు. అయితే, కాలక్రమేణా అందులో రెండు పార్కులు అన్యాక్రాంతమయ్యాయి. మిగిలిన మూడో పార్కు స్థలం కూడా కబ్జా కోరల్లోకి వెళ్తుండటంతో గోపాల్‌నగర్‌ రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు 'హైడ్రా' ప్రజావాణిలో కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

​క్షేత్రస్థాయిలో విచారణ.. మెరుపు చర్యలు
​బాధితుల విన్నపంపై తక్షణమే స్పందించిన కమిషనర్‌.. రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులతో సంయుక్త విచారణకు ఆదేశించారు. రికార్డులను పరిశీలించి, క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన అధికారులు అది పార్కు స్థలమేనని నిర్ధారించారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది శుక్రవారం అక్కడ అక్రమంగా నిర్మించిన షెడ్డును కూల్చివేశారు. సుమారు 3300 గజాల స్థలానికి రక్షణగా ఫెన్సింగ్‌ వేసి.. అది పార్కు స్థలమని, ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు.

​హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు:

​"ఏళ్లుగా మొరపెట్టుకున్నా పట్టించుకున్న నాథుడే లేడు. ఇప్పటికే రెండు పార్కులు పోయాయి. కనీసం ఈ స్థలమైనా దక్కుతుందో లేదో అని ఆందోళన చెందాం. కానీ హైడ్రా స్పందించిన తీరు అమోఘం" అని కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడుతున్న హైడ్రా చర్యలపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

About The Author