
రాజన్న సిరిసిల్ల :
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇతర ఎన్నికల సంఘం అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే హాజరయ్యారు. గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా అభ్యంతరాలు, పోలింగ్ కేంద్రాలు, శాంతిభద్రతల అంశాలపై సమీక్షించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ మాట్లాడుతూ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించాలని, ఎన్నికలను నిర్వహించేందుకు అవసరమైన కార్యచరణ రూపొందించాలని తెలిపారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి సమర్థవంతంగా అమలు చేయాలని, ఎన్నికల పరిశీలకులకు శిక్షణ అందించడం జరుగుతుందని, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యుల జాబితా సమర్పించాలని తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డీఆర్డీఓ శేషాద్రి, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, డీపీఓ శర్ఫుద్దిన్, డిప్యూటీ జడ్పీ సీఈవో గీత తదితరులు పాల్గొన్నారు.