అర్ధరాత్రి స్కెచ్: గూబ గుయ్ మనేలా నోటిఫికేషన్.. విపక్షాల గుండెల్లో రైళ్లు.!

  • బీసీ రిజర్వేషన్ల కొట్లాట: కోర్టు మెట్లెక్కకముందే.. పని ముగించేయాలనే   యోచన..!
  • ​నో డ్యూస్ పంచాయితీ: బకాయిల పేరిట బ్రేకులు.. అభ్యర్థులకు వడపోత గండం!
  • ​గులాబీ కోటలో హస్తం జోరు: కారుకు బ్రేకులు వేసి.. అర్బన్ గడ్డపై జెండా పాతాలని కసి!
  • ​కమలం కన్ఫ్యూజన్: గల్లీ ఫైట్ రెడీనే గానీ.. అభ్యర్థుల వేటలో కమలనాథుల తిప్పలు!

అర్ధరాత్రి స్కెచ్: గూబ గుయ్ మనేలా నోటిఫికేషన్.. విపక్షాల గుండెల్లో రైళ్లు.!

ఒకాయన అర్ధరాత్రి కటిక చీకట్లో గొర్రెల మంద కాడికి పోయి, ఒక్కటే సారి గట్టిగా ఈల కొట్టిండట. పాపం.. ఆ గొర్రెలు ఉలిక్కిపడి కళ్లు తెరిచేలోపే, 'తెల్లారేసరికి ఎవడు దొరికితే వాని మెడలో గంట కట్టేయాలి' అని హుకుం జారీ చేసిండట. ఇప్పుడు మన మున్సిపల్ ఎన్నికల ముచ్చట కూడా అచ్చం ఇట్నే ఉంది. విపక్షాలేమో 'పైసలు సర్దుకోవాల్నా? బీ-ఫారాలు పట్టుకోవాల్నా?' అని కాళ్లు కాలిన పిల్లుల్లా అల్లాడుతుంటే, సర్కారు మాత్రం 'నో డ్యూస్' సర్టిఫికేట్ల సాకుతో కడ్డీలు పెట్టి ముసిముసి నవ్వులు నవ్వుతోంది. కులగణన లొల్లి కోర్టు మెట్లెక్కకముందే, అపోజిషన్ ఊపిరి తీసుకోనియ్యకుండా రాత్రికి రాత్రే 'స్కెచ్' గీసి, తెల్లారేసరికి నోటిఫికేషన్ దంచికొట్టింది. ఇది ప్రజాస్వామ్య వేగం కాదు నాయనా.. విపక్షాలను 'ఆగం' జేసి గద్దెనెక్కే గజకర్ణ గోకర్ణ విద్య అని జనం నవ్వుకుంటున్నరు!"

పరిశోధనాత్మక పాత్రికేయులు.. వి.జి(ఎం. వేణుగోపాల్)

​హైదరాబాద్: 

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. కానీ, ఈసారి ఎలక్షన్ షెడ్యూల్ చూస్తుంటే అపోజిషన్ పార్టీలకు ‘టైమ్’ ఇయ్యకుండా ఉక్కిరిబిక్కిరి చేయాలన్న ప్లాన్ గట్టిగానే కనిపిస్తున్నది. "రాత్రికి రాత్రి స్కెచ్ గీసి.. పొద్దుగాలనే నోటిఫికేషన్ దంచికొట్టినట్టు" ఉంది పరిస్థితి. జనవరి 27న షెడ్యూల్ ఇచ్చి.. తెల్లారే (28న) నామినేషన్లు అంటే, అభ్యర్థులు బీ-ఫారాల కోసం పరిగెత్తాల్నా? లేక పైసలు సర్దుబాటు చేసుకోవాల్నా? అని విపక్షాలు పరేషాన్ అవుతున్నాయి. ఈ మెరుపు వేగం వెనుక పెద్ద కథే ఉందన్న చర్చ నడుస్తోంది.

​1. ఆగం జేసేందుకే.. ఈ 'అకస్మాత్తు' ఆపరేషన్!
​సాధారణంగా ఎన్నికలు ఉన్నాయంటే నెల ముందే హడావుడి ఉంటది. కానీ ఇక్కడ సీన్ రివర్స్. అభ్యర్థులను వెతుక్కునే లోపే పోలింగ్ పెట్టేయాలన్నది అధికార పార్టీ 'ఇకమతు' (ఉపాయం) అని తెలుస్తోంది. బీఆర్ఎస్, బీజేపీలు తమ అభ్యర్థులను ఫైనల్ చేసుకునే లోపే నామినేషన్ల గడువు ముగిసేలా ప్లాన్ చేశారు. అంటే, విపక్షాలు కోలుకోకముందే దెబ్బ కొట్టాలన్నది సర్కారు వ్యూహం. అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే నామినేషన్ల ఘట్టం ముగించేయాలని హస్తం పార్టీ స్పీడ్ పెంచింది.
​2. బీసీ రిజర్వేషన్ల లొల్లికి చెక్!
​ఈసారి మున్సిపల్ ఎలక్షన్లలో బీసీ రిజర్వేషన్ల అంశం పెద్ద దుమారమే లేపింది. కులగణన, రిజర్వేషన్ల దామాషాపై విపక్షాలు కోర్టులకు వెళ్లి స్టే తెచ్చే లోపే ఎన్నికల ప్రక్రియను పట్టాలెక్కించాలని కాంగ్రెస్ భావించింది. ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిందంటే కోర్టులు కూడా జోక్యం చేసుకోవడం కష్టమని తెలిసి, ఈ 'రాకెట్ స్పీడ్' పెంచినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.

​3. 'నో డ్యూస్' మంత్రం.. అభ్యర్థులకు గండం!
​మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేటోళ్లు ఇంటి పన్ను, నల్లా బిల్లులు బకాయి ఉండొద్దని కండీషన్ పెట్టారు. ఎప్పుడో కట్టాల్సిన బిల్లులను ఇప్పుడు అర్జంటుగా కట్టాలనడం వెనుక అసలు ‘ఇగురం’ ఉంది. చాలామంది ఆశావహులు ఈ బకాయిల వల్ల నామినేషన్ వేసే టైమ్ కల్లా 'నో డ్యూస్' సర్టిఫికేట్ తెచ్చుకోలేక ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇది ఒక రకంగా వడపోత కార్యక్రమమే అని విశ్లేషకులు అంటున్నారు. అభ్యర్థిని ఖరారు చేసుకున్నా.. సర్టిఫికేట్ రాకపోతే కథ అడ్డం తిరుగుతదని విపక్ష నేతలు భయపడుతున్నారు.

​4. గులాబీ కోటలకు కౌంట్‌డౌన్ మొదలైనట్టేనా?
​గత పదేళ్లుగా మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ హవా నడిచింది. ఇప్పుడు అదే పట్టును కాపాడుకోవాలని కేటీఆర్ కష్టపడుతుంటే.. పట్టణ ఓటర్లలో ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ చూస్తోంది. సంక్షేమ పథకాల జోరు, రుణమాఫీ ఎఫెక్ట్ ఉండగానే ఎన్నికలు ముగిస్తే, పట్టణాల్లో కూడా 'చేయి' తిరుగులేని శక్తిగా మారుతుందని కాంగ్రెస్ నమ్మకం. గులాబీ కారుకు బ్రేకులు వేసి, అర్బన్ ఏరియాల్లో జెండా పాతాలని హస్తం నేతలు కసిగా ఉన్నారు.

​5. బీజేపీ గల్లీ ఫైట్.. కమలానికి కలిసొచ్చేనా?
​పట్టణాల్లో బీజేపీకి ఉన్న క్యాడర్ ఇప్పుడు ఆ పార్టీకి ప్లస్ పాయింట్. అయితే, కాంగ్రెస్ వేసిన ఈ ‘స్పీడ్ ప్లాన్’ వల్ల బీజేపీ కూడా అభ్యర్థుల ఎంపికలో తిప్పలు పడుతోంది. ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారో లెక్కలు వేసే లోపే నామినేషన్ల గడువు ముగుస్తుండటంతో కమలనాథులు ఇప్పుడు హైకమాండ్ వైపు దిక్కులు చూస్తున్నారు. మోదీ చరిష్మాను నమ్ముకున్నా.. లోకల్ గా అభ్యర్థుల సెట్టింగ్ కు టైమ్ సరిపోకపోవడం ఆ పార్టీని కలవరపెడుతోంది.

మొత్తానికి సర్కారు విసిరిన ఈ 'మున్సిపల్ బాణం' విపక్షాలకు తగులుతుందా లేక రివర్స్ అవుతుందా అన్నది చూడాలి.

About The Author